Medaram | మేడారంలో ఆకట్టుకుంటున్న గ్రామీణ జీవన శిల్పాలు
జాతరకు ప్రత్యేక శోభ
ఏటూరునాగారం, జనవరి 08 (తెలంగాణ జ్యోతి): ఆసియాలోనే అతి పెద్ద ఆదివాసీ గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర ఈసారి గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించే విశిష్ట శిల్ప సముదాయంతో మరింత కళాత్మక వైభవాన్ని సంతరించుకుంది. జాతర ప్రాంగణం పరిసరాల్లో ఏర్పాటు చేసిన ఈ శిల్పాలు భక్తులు, సందర్శకు లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
శిల్ప సముదాయంలో మధ్యలో ఏర్పాటు చేసిన భారీ చెట్టు చుట్టూ సంప్రదాయ దుస్తుల్లో మహిళలు, రైతులు కనిపించే దృశ్యాలు గ్రామీణ జీవనానికి అద్దం పడుతున్నాయి. వ్యవసాయ పనిముట్లతో కష్టపడుతున్న రైతులు, ఎద్దుల బండితో పొలానికి వెళ్తున్న రైతు రూపాలు ఆదివాసీ జీవనశైలి, వ్యవసాయ ఆధారిత సంస్కృతిని కళ్లకు కట్టినట్లు చూపిస్తు న్నాయి. పక్షులు, ప్రకృతి అంశాలు శిల్పాల్లో భాగంగా ఉండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది.

ప్రతి రెండేళ్లకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే మేడారం జాతర సందర్భంగా గిరిజనుల జీవన విధానం, వారి శ్రమజీవనం, ప్రకృతితో ఉన్న అనుబంధాన్ని నేటి తరానికి పరిచయం చేయాలనే లక్ష్యంతో ఈ శిల్పాల ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
జాతర రోజులకే పరిమితం కాకుండా అనంతరం కూడా ఈ శిల్పాలు మేడారానికి వచ్చే సందర్శకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. భక్తులు, ప్రయాణికులు శిల్పాల వద్ద ఫోటోలు తీసుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మేడారం అభివృద్ధిలో భాగంగా ఇలాంటి కళా–సౌందర్య కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఆదివాసీ సంస్కృతి పరిరక్షణతో పాటు పర్యాటకాభివృద్ధికి కూడా దోహదపడుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. జాతరకు వచ్చిన భక్తులకు ఆధ్యాత్మికతతో పాటు గ్రామ భారతీయం సజీవంగా కనిపించేలా ఈ శిల్పాలు నిలుస్తున్నా యని వారు చెబుతున్నారు.







