సద్దుల బతుకమ్మకు మార్కెట్లో పూల విక్రయాల సందడి
– వెల్లివిరిసిన రంగుల హరివిల్లులు
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం బతుకమ్మ పండుగ గురు వారం సద్దుల బతుకమ్మతో ముగుస్తుండగా బతుకమ్మలను అందంగా అలంకరించేందుకు వెంకటాపురం మార్కెట్లో రక రకాల పూలు విక్రయించేందుకు స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు రెండు మూడు రకాల బంతి పూలతో పాటు10 రకాల రంగుల హరివిల్లులు వెంకటాపురం మార్కెట్లో విక్రయాలు జరుగుతున్నాయి. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లా ల ప్రాంతాల నుండి బంతిపూలు మార్కెట్కు రాగా కిలో 125 నుండి 150 రూపాయలు మధ్యలో ఆయా రకాలను బట్టి జోరుగా విక్రయాలు జరుగుతున్నాయి. వెంకటాపురం వాజే డు మండలంలో బతకమ్మల అలంకరణ కోసం మహిళా సోదరీమణులు పెద్ద ఎత్తున పూలు కొనుగోలు చేస్తుండడంతో పూల మార్కెట్లలో సందడి నెలకొన్నది. ఒకపక్క బతుకమ్మ సంబరాలు, మరోపక్క శ్రీదేవి కనకదుర్గమ్మ తల్లి నవరాత్రి పూజా కార్యక్రమాలు, దసరా పండుగ సందర్భంగా, వర్తక వాణిజ్య సంస్థలు, బంగారపు దుకాణాలు, ముఖ్యంగా బట్టల దుకాణాలు, రెడీమేడ్ షాపులు, ఫ్యాన్సీ స్టోర్లు కొనుగోలు దారులతో కిట కిట లాడుతున్నాయి. దసరా పండుగ సంద ర్భంగా గృహిణులు పిండి వంటలు తయారు చేసేందుకు సన్నద్ధమవుతుండగా పిండి గిర్నీ ల వద్ద క్యూలు కట్టారు.