వాహన తనిఖీలో గంజాయి పట్టివేత : ముగ్గురు అరెస్ట్
ములుగు, మార్చి 18, తెలంగాణ జ్యోతి: మల్లంపల్లి మండలం శ్రీనగర్ క్రాస్ వద్ద పోలీసులు వాహన తనిఖీలలో గంజాయి స్వాధీనం చేసుకుని ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఎస్సై చంద్రశేఖర్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఒక బైక్‌పై వచ్చిన ముగ్గురు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని ఆపగా పారిపోవడానికి ప్రయత్నించారు. వెంటనే పోలీసు సిబ్బంది సహాయంతో వారిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా బైక్ ట్యాంక్ కవర్‌లో 153 గ్రాముల ప్రభుత్వ నిషేధిత ఎండు గంజాయి లభ్యమైంది. విచారణలో వారు రూ.4 వేలకే కేజీ గంజాయి కొనుగోలు చేసి చిన్న ప్యాకెట్లుగా చేసి విక్రయిస్తున్నట్లు, మిగిలిన గంజాయిని మల్లంపల్లి ప్రాంతంలో అమ్మేందుకు వస్తుండగా శ్రీనగర్ క్రాస్ వద్ద పట్టుబడినట్లు ఒప్పుకున్నారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసి ములుగు జిల్లా జేఎఫ్సీఎం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు. గంజాయి వంటి మత్తు పదార్థాల విక్రయం, వినియోగంపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.






