కొమరం భీమ్ ఆశయాలను సాధిద్దాం : పూనెం సాయి.
ఎన్నికల వేళ రాజకీయ పార్టీలకు గుర్తు రాని గోండు వీరుడు
నూగూరు వెంకటాపురం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : తెలంగాణ విముక్తి కోసం, ఆదివాసీల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొమరం భీమ్ జయంతి రాజకీయ పార్టీలకు గుర్తుకు రాకపోవడం శోచనీయమని ఆదివాసి నేత పూనెం సాయి విమర్శలు గుప్పించారు. ఆదివారం ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల కేంద్రంలో ఉన్న కొమరం భీమ్ విగ్రహానికి జయంతి సందర్బంగా,ఆదివాసి నేతలు ,సంఘాలనాయకులు పూనెం సాయి, చింత సోమరాజు, పూల మాలలు వేశారు.కొమరం భీమ్ ఆదివాసీల ఆరాధ్య దైవం కావడం తో ఆయన జయంతి ని మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.అనంతరం జీ ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో, ఎన్నికలు సమీపించిన వేళ ఆదివాసీల ఊసే లేదన్నారు. ఆదివాసి నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఉపాధి కోసం పట్టణాలకు వలస వెళ్లే పరిస్థితి దాపురించిందన్నారు. ఏజెన్సీ డి ఎస్సి పదేళ్లలో ఒక్కసారి కూడా నిర్వహించలేదన్నారు. ఏజెన్సీ ఉద్యోగాలన్నీ మైదాన ప్రాంత గిరిజనేతరులకు పంచి పెట్టిన భారాస పార్టీకి, పదకొండు గిరిజనేతర కులాలను ఎస్టీ జాబితాలో కలపాలని శాసన సభలో తీర్మానం ప్రవేశ పెట్టినప్పుడు ప్రతిపక్ష పార్టీ వ్యతిరేఖించక పోవడం చూస్తే ఈ రెండు పార్టీల డోల్లతనం బయట పడిందని కాంగ్రెస్, భారసా పార్టీల పైన ఆయన మండిపడ్డారు. ఏ ఒక్క రాజకీయ పార్టీ ఏజెన్సీ ప్రాంత చట్టాలను వంద శాతం అమలు చేస్తామని గాని,జిఓ 3 ని చట్టం చేస్తామని గాని తమ మ్యానిఫెస్టో లో పొందు పర్చ లేదన్నారు. ఈ దగా కోరు రాజకీయ పార్టీలను ఏజెన్సీ ప్రాంతం నుండి తరిమి కొట్టాలని ఆయన ఆదివాసీలకు పిలుపునిచ్చారు. కొమరం భీమ్ ఆశయాలను అమలు కొరకు ఆదివాసీలు అంత సంఘటీతంగా ఈ భూర్జువ రాజకీయ పార్టీలను బొంద పెట్టాలని నేత చింత సోమరాజు పార్టీల వైఖరి పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీల పక్షాన నిలబడని ఏ ఒక్క రాజకీయ పార్టీకి ఓటు వేసే ప్రసక్తే లేదన్నారు. ఆదివాసి నేతలు పర్సిక సతీష్, కంతి వెంకట్, పాయం కృష్ణ తదితరులు జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు.
1 thought on “కొమరం భీమ్ ఆశయాలను సాధిద్దాం : పూనెం సాయి.”