అంగరంగ వైభవంగా కార్తీక జ్యోతిర్ మహోత్సవం
– తరలివచ్చిన భక్తజనం
వెంకటాపురం, నవంబర్ 17, తెలంగాణ జ్యోతి : కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రం మంగపేట రోడ్‌లోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో సోమవారం రాత్రి నిర్వహించిన శ్రీ కార్తీక జ్యోతిర్ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పదివేల 408 దీపాలు వెలిగించే కార్యక్రమానికి మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పాల్గొన్నారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మాల ధారణ గురుస్వామి కార్తీకదీపాన్ని వెలిగించి మహోత్సవాన్ని ప్రారంభించారు. ఆలయం ముందు భాగంలో కమిటీ ఏర్పాటు చేసిన ప్రాంగణంలో మహిళలు భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగిస్తూ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ స్వామివారి ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేసింది. వేలాది దీపాలు వెలిగించడంతో ఆలయ ప్రాంగణం దేదీప్యమానంగా దర్శనమిచ్చి భక్తులకు ఆధ్యాత్మిక పరవశాన్ని పంచగా, కార్తీక జ్యోతిర్ మహోత్సవంతో గ్రామం మొత్తం భక్తిరసమయ వాతావరణాన్ని సంతరించుకుంది.





