పంచాయతీ ఎన్నికల్లో ములుగులో చెక్కుచెదరని బీఆర్ఎస్ ఓటుబ్యాంక్

On: December 16, 2025 3:46 PM

పంచాయతీ ఎన్నికల్లో ములుగులో చెక్కుచెదరని బీఆర్ఎస్ ఓటుబ్యాంక్

పంచాయతీ ఎన్నికల్లో ములుగులో చెక్కుచెదరని బీఆర్ఎస్ ఓటుబ్యాంక్

రెండు విడతల్లో కాంగ్రెస్–బీఆర్ఎస్ మధ్య కేవలం 5 వేల ఓట్ల తేడా

ప్రలోభాలు, బెదిరింపులు ఉన్నా ప్రజల మద్దతు బీఆర్ఎస్‌కే

మంత్రి సీతక్క సొంతూరిలో ఉపసర్పంచ్ బీఆర్ఎస్‌కే నిదర్శనం

ములుగు ప్రతినిధి, డిసెంబర్ 16, తెలంగాణ జ్యోతి : ములుగు నియోజకవర్గంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటుబ్యాంక్ ఏమాత్రం చెక్కుచెదరలేదని, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని రెడ్కో మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నేత వై. సతీష్ రెడ్డి అన్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలు ప్రజలు ఇంకా బీఆర్ఎస్ వైపే ఉన్నారనే విషయాన్ని స్పష్టంగా చూపించాయని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రి సీతక్క సొంతూరు జగ్గన్నపేటలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బెదిరింపులతో సర్పంచ్‌గా ఏకగ్రీవం చేశారని ఆరోపించిన సతీష్ రెడ్డి, అయినప్పటికీ అక్కడ ఉపసర్పంచ్ పదవి బీఆర్ఎస్ అభ్యర్థికే దక్కడం బీఆర్ఎస్ బలం ఎంతటిదో చాటుతోందన్నారు. పోలింగ్ జరిగితే బీఆర్ఎస్ అభ్యర్థులే గెలుస్తారనే భయంతోనే కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవాలకు పాల్పడిందని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికలకంటే ఎక్కువగా మంత్రి సీతక్క గ్రామాల్లో తిరిగి, లెక్కకు మించి హామీలు ఇచ్చారని విమర్శించారు. వెయ్యి మంది ఓటర్లు కూడా లేని గ్రామాల్లో 100 నుంచి 200 ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారని, మొత్తం నియోజకవర్గానికి 15 వేల ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని పంచాయతీ ఎన్నికల ప్రచారంలో చెప్పారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలే నెరవేర్చని వారు ఇప్పుడు మరోసారి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని అన్నారు. పంచాయతీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ అభ్యర్థులు, నాయకులపై పోలీసు, కాంగ్రెస్ నేతల బెదిరింపులు నెలరోజులుగా కొనసాగాయని, పథకాల పేరుతో ప్రజలను కూడా బెదిరించారని ఆరోపించారు. స్వయంగా మంత్రి సీతక్క అక్కడే ఉండి పెద్ద ఎత్తున డబ్బుల పంపిణీ జరిగిందని అన్నారు. అయినప్పటికీ ములుగు ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచారని స్పష్టం చేశారు.ఏటూరునాగారం వంటి కీలక పంచాయతీని బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. రెండు విడతల పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మొత్తం 42 వేల ఓట్లు రాగా, బీఆర్ఎస్ పార్టీకి 37 వేల ఓట్లు వచ్చాయని తెలిపారు. రెండు పార్టీల మధ్య కేవలం 5 వేల ఓట్ల తేడా మాత్రమే ఉందని, ఎంత ప్రలోభాలు పెట్టినా, ఎంత బెదిరించినా ప్రజలు బీఆర్ఎస్ వైపే నిలిచారని అన్నారు.కేసీఆర్‌పై ఉన్న ప్రేమతో బీఆర్ఎస్‌కు ఓటు వేసిన ప్రజలకు, అధికార పార్టీ బెదిరింపులను ఎదుర్కొని పోరాడిన అభ్యర్థులకు, పార్టీకి అండగా నిలిచిన ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తకు సతీష్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అధికార పార్టీ బెదిరింపులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, రాష్ట్ర నాయకత్వం పూర్తి అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!