కన్నాయిగూడెం మండలంలో ఆగని అక్రమార్కుల ఇసుక రవాణ..!
ఇసుక రవాణా చేస్తుండగా ట్రాక్టర్‌కు పంచర్
వాగులు, వాగు పరివాహక ప్రాంతాలే లక్ష్యంగా యథేచ్ఛ దోపిడీ
కన్నాయిగూడెం, జనవరి 8 (తెలంగాణ జ్యోతి): మండల పరిధిలో ఇసుక అక్రమ రవాణా అడ్డుకట్ట లేకుండా కొనసాగుతుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాగులు, వాగు పరివాహక ప్రాంతాల నుంచి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తూ అక్రమార్కులు బరి తెగిస్తుండగా, రాత్రి పగలు తేడా లేకుండా ట్రాక్టర్లు, టిప్పర్లతో రవాణా సాగుతోంది. ఈఅక్రమ రవాణా కారణంగా గ్రామ రహదారులు ధ్వంసమవు తుండటంతో పాటు ప్రజలకు ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో హనుమంతుడు వాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తుండగా బుట్టాయిగూడెం గ్రామ పరిధిలో ఓ ట్రాక్టర్‌కు టైర్ పంచర్ కావడంతో వాహనం రోడ్డుపై నిలిచిపోయింది. దీంతో కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాగు ప్రాంతాల నుంచి యథేచ్ఛగా సాగుతున్న ఇసుక రవాణాపై అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని, అక్రమ ఇసుక వాహనాలపై నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.





