సరస్వతి అంత్య పుష్కరాలకు రూ.30.16 కోట్లు
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
కాటారం, జనవరి 14 (తెలంగాణ జ్యోతి): మే 21 నుంచి జూన్ 1 వరకు మహదేవ్‌పూర్ మండలం కాళేశ్వరంలో నిర్వహించనున్న సరస్వతి అంత్య పుష్కరాలకు ప్రభుత్వం రూ.30.16 కోట్ల నిధులు మంజూరు చేసిందని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఇందులో రూ.16 కోట్లతో శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. బుధవారం కాళేశ్వరం దేవాలయ ఈఓ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌తో కలిసి వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, గత పుష్కరాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించాలని, ఫిబ్రవరి మొదటి వారంలోపే టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. కాళేశ్వరం మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా రహదారులు, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్, వైద్య సేవలు, భద్రత వంటి అన్ని ఏర్పాట్లు సమన్వయంతో చేపట్టాలని సూచించారు. జిల్లా ఎస్పీ సంకీర్త్ పటిష్టమైన బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, సీసీ కెమెరాల ద్వారా నిఘా, పార్కింగ్ ఏర్పాట్లు, డ్రాప్ గేట్లతో ప్రైవేట్ వాహనాల నియంత్రణ చేపడతామని చెప్పారు. రాష్ట్ర ధార్మిక సలహాదారు గోవింద హరి అంత్య పుష్కరాలను ఆది పుష్కరాల మాదిరిగానే వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ప్రచారం, పెండింగ్ దేవాదాయ పనుల పూర్తి, “కాళేశ్వర ఖండం” పుస్తక విడుదల, ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించాలని సూచించారు. సమావేశంలో సబ్ కలెక్టర్ మాయం సింగ్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.






