నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి
– 29 కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలి
– కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానం రద్దు చేయాలి
ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసి 29 కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా నిర్వహించిన సార్వత్రిక సమ్మెలో భాగంగా ములుగు జిల్లా కేంద్రంలో ఏఐటీయూసీ, సిఐటియు తదితర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ముందు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రత్నం రాజేందర్ లు మాట్లాడుతూ దాదాపు 100 సంవత్సరాల పోరాట ఫలితంగా సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ యాజమాన్యాలకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్లుగా మార్చిందని ఆరోపించారు. దీనివల్ల కార్మికులకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత, సమ్మె హక్కు వంటి హక్కులు ప్రమాదంలో పడుతున్నాయని పేర్కొన్నారు. వెంటనే లేబర్ కోడ్లను రద్దు చేసి పాత కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్కీం వర్కర్లందరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, థర్డ్ పార్టీ విధానాలను రద్దు చేసి శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. మధ్యాహ్న భోజన వంట కార్మికులకు కనీస వేతనాలు కల్పించాలని, సెంట్రలైజ్డ్ కిచెన్ విధానం రద్దు చేయాలని, భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని, సివిల్ సప్లై హమాలీలను, మున్సిపల్ మరియు గ్రామపంచాయతీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, అన్ని డిమాండ్లు నెరవేరే వరకు ఐక్య సమరాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎండి అంజాద్ భాష, తెలంగాణ రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి పల్లెబోయిన స్వామి, అధ్యక్షులు బానోత్ నరసింహ, న్యూడెమోక్రసీ నాయకులు బొమ్మిడి సాంబయ్య, ఏఐటీయూసీ నాయకులు మొలుగూరి రాంబాబు, ముత్యాల రాజు, కొక్కుల రాజేందర్, దేవేందర్, పోరెడ్డి ప్రమీల, కమలక్క, భారతి, సరోజన, రాజకుమారి, కుమారి, ఐలయ్య, శ్యాంసుందర్, బుడిమె సదయ్య, మంకీ డి కృష్ణ, ఆశ నాయకులు నీలాదేవి, రమాదేవి, మున్సిపల్ నాయకులు జయాకర్, సుధర్శన్, సిఐటియు నాయకులు మహేష్, ప్రవీణ్, రవి తదితరులు పాల్గొన్నారు.






