వెంకటాపురంలో అటవీ అమరవీరుల సంస్కరణ దినోత్సవం
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : విధి నిర్వహ ణలో ప్రాణాలను ఫణంగా పెట్టి అటవీ సంపదను కాపాడే ప్రయత్నంలో అసువులు బాసిన అటవీ శాఖ అమరుల కు జోహార్లు అంటూ బుధవారం ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది భారీ ర్యాలీ నిర్వహించారు. వెంకటాపురం ఫారెస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని, వాజేడు, ధూలాపురం, వెంకటాపురం తదితర మూడు ఫారెస్ట్ రేంజ్ కార్యాలయాల పరిధిలోని, సెక్షన్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లు, సిబ్బంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చంద్రమౌళి ర్యాలీని ప్రారంభించి, విధి నిర్వహణలో అశువులు బాసిన అటవీ అమర వీరులకు జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా వెంకటాపురం ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం నుండి ప్రారంభమైన భారీ ర్యాలీ మార్కెట్ సెంటర్, అంబేద్కర్ సెంటర్, కనకదుర్గమ్మ గుడి వీధి తదితర ప్రధాన వీధులలో అమరవీరులకు జోహార్లు అంటూ ద్విచక్ర వాహనాలపై భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ అమరవీరుల కు జోహార్లు అంటూ నినాదాలు చేశారు. అనంతరం అమరవీరుల జ్ఞాపకార్థం కొన్నిచోట్ల మొక్కలు నాటారు.