ధర్మారం గ్రామపంచాయతీ వీధుల్లో విద్యుత్తు వెలుగులు
జి.పి. పాలక మండలికి ప్రజల అభినందనలు
వెంకటాపురం (నూగూరు), జనవరి 16 (తెలంగాణ జ్యోతి): ములుగు జిల్లా వాజేడు మండలం ధర్మారం గ్రామపంచాయతీలో నూతనంగా ఎన్నికైన పంచాయతీ పాలకవర్గం సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామాన్ని వెలుగులతో అలంకరించింది. పంచాయతీ పరిధిలోని ఎనిమిది వార్డులలో వీధిదీపాలను ఏర్పాటు చేసి, చీకట్లను పారద్రోలి ప్రజలకు వెలుతురు అందించడంతో గ్రామమంతా పండుగ శోభను సంతరించుకుంది. ఎన్నో నెలలుగా ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న పంచాయతీలు, గత డిసెంబర్‌లో నిర్వహించిన పంచాయతీ ఎన్నికలతో ప్రజాప్రతినిధుల పాలనలోకి వచ్చాయి. ధర్మారం గ్రామపంచాయతీలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన కాకా సుమతితో పాటు పాలకవర్గ సభ్యులు ఘన విజయం సాధించారు. ఇంతకాలం వీధిదీపాలు లేక గ్రామంలోని అన్నదాతలు, కార్మికులు, కర్షకులు, కష్టజీవులు చీకట్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని స్థానికులు తెలిపారు. ప్రభుత్వ నిధుల కోసం ఎదురుచూడకుండా, ప్రజా సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చాటుతూ, సంక్రాంతి పర్వదినం సందర్భంగా చిరు కానుకగా అన్ని వార్డుల వీధుల్లో లైట్లను ఏర్పాటు చేయడం ప్రజల మనసులను గెలుచుకుంది. ఈ సందర్భంగా సర్పంచ్ కాకా సుమతి, ఉప సర్పంచ్ బొల్లె సూర్యం, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు మాట్లాడుతూ… ప్రభుత్వం నుంచి పంచాయతీకి కేటాయించే నిధులను గ్రామసభల ద్వారా ప్రజల అభిప్రాయాలు తీసుకొని, తీర్మానాల మేరకు ధర్మారం గ్రామ అభివృద్ధికి వినియోగిస్తామని తెలిపారు. గ్రామానికి వెలుగులు తీసుకొచ్చిన పాలకవర్గానికి ధర్మారం ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తూ, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.






