తాత్కాలిక ఆనందం కోసం భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు
– ములుగు ఎస్సై సిహెచ్ వెంకటేశ్వర రావు
ములుగు, డిసెంబర్ 31, తెలంగాణ జ్యోతి : నూతన సంవత్సర వేడుక లను ప్రజలు సంతోషంగా, బాధ్యతతో గడపాలని ములుగు పోలీస్ స్టేషన్ ఎస్సై సిహెచ్ వెంకటేశ్వర రావు పిలుపునిచ్చారు. తాత్కాలిక ఆనందం కోసం మద్యం సేవించి వాహనాలు నడిపి భవిష్యత్తును నాశనం చేసు కోవద్దని ఆయన హెచ్చరించారు. నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా డిసెంబర్ 31వ తేదీన ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తామని ఎస్సై తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ఎలాంటి ఉపేక్ష ఉండదని, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డీజేలు, అధిక శబ్దం వచ్చే సౌండ్ బాక్సులు వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించేలా శబ్ద కాలుష్యం సృష్టించకూడదని సూచించారు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే, వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులు లేదా యజమానులపై కూడా కేసులు నమోదు చేస్తామని ఎస్సై సిహెచ్ వెంకటేశ్వరరావు తెలిపారు. నూతన సంవత్సర వేడుకలను శాంతి యుతంగా, భద్రతతో నిర్వహించుకోవాలని ఆయన ప్రజలను కోరారు.





