మేడారం జాతరలో ప్లాస్టిక్ వాడకండి – పర్యావరణాన్ని కాపాడండి
– రాష్ట్ర మంత్రి సీతక్క
ములుగు, జనవరి 10 (తెలంగాణ జ్యోతి): మేడారం జాతరలో ప్లాస్టిక్ వాడకండి – పర్యావరణాన్ని కాపాడండి అంటూ ములుగు జిల్లా ఎస్.ఎస్. తాడ్వాయి మండలం పరిధిలోని మేడారం జాతర అటవీ ప్రాంతంలో ఏ.ఎస్.ఆర్ సేవా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క చేతుల మీదుగా గోడపత్రికలు, కరపత్రాలు ఆవిష్కరించారు. “ప్లాస్టిక్‌ను వాడకండి – పర్యావరణాన్ని పరిరక్షించండి”, “జాతరకు వచ్చే భక్తులు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడవద్దు” అనే నినాదాలతో విడుదల చేసిన ఈ అవగాహన పత్రాల ద్వారా జాతరలో పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి సీతక్క తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మేడారం జాతరకు వచ్చే భక్తులు అటవీ ప్రాంతంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు, కవర్లు వాడకూడదని, ముఖ్యంగా వేడి ఆహారాన్ని ప్లాస్టిక్ పాత్రల్లో తీసుకోవడం వల్ల జీర్ణకోశ వ్యాధులు, క్యాన్సర్ వంటి ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరగా గుర్తింపు పొందిన మేడారం జాతరలో భక్తులు గాలి, భూమి, నీటిని కాపాడే విధంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్పీ రామ్నాథ్ సుధీర్ కేకన్, డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, ఏ.ఎస్.ఆర్ సేవా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు ఎర్రబోయిన రాజశేఖర్, సభ్యులు రాముసేవక్, రవికాంత్, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






