సంక్రాంతి సందర్భంగా ములుగులో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు
డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో జనవరి 10, 11 తేదీల్లో నిర్వహణ
ములుగు, జనవరి 07 (తెలంగాణ జ్యోతి): సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గ్రామీణ క్రీడలను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డివైఎఫ్ఐ) మరియు స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు జనవరి 10, 11 తేదీల్లో ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ ములుగు జిల్లా అధ్యక్షులు కలువల రవీందర్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి.ఎల్. రవి మాట్లాడుతూ గ్రామీణ యువతలో క్రీడాభిమానాన్ని పెంపొందించడం, సాంప్రదాయ క్రీడలను పరిరక్షించడమే ఈ పోటీల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. జిల్లా నలుమూలల నుంచి కబడ్డీ జట్లు ఈ పోటీల్లో పాల్గొననున్నాయని, విజేతలకు మొదటి బహుమతిగా రూ.10 వేలు, రెండో బహుమతిగా రూ.5 వేలు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కుంజ సూర్య, ములుగు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ బాదం ప్రవీణ్ హాజరై పోటీలను ప్రారంభించనున్నారని తెలిపారు. జిల్లా యువత పెద్ద సంఖ్యలో ఈ కబడ్డీ పోటీల్లో పాల్గొనాలని డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు పిలుపునిస్తూ, క్రీడల ద్వారా యువత ఆరోగ్యం, ఐక్యత మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సాధు రాకేష్, కర్నే లాజర్, అరుణ్, మోరే లక్ష్మణ్, బాలేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వివరాలకు డివైఎఫ్ఐ / ఎస్ఎఫ్ఐ ములుగు జిల్లా కమిటీని 8008938848, 9704029723 నంబర్లలో సంప్రదించాలని కోరారు.






