పాటతోనే ప్రజల్లో చైతన్యం : రాష్ట్ర మంత్రి సీతక్క
ములుగులో అడవిగన్న ములుగు ఆడియో లాంచ్ చేసిన మంత్రి
ములుగు, జనవరి 8, తెలంగాణ జ్యోతి : పాటతోనే ప్రజల్లో చైతన్యం పెరిగిందని, తెలంగాణ రాష్ట్ర సాధనతోపాటు ములుగు జిల్లా ఉద్యమంలో సైతం ప్రజలను చైతన్యవంతులను చేసిన పాట ములుగు చరిత్రను ఆరూపంలో బయటకు తీయడం అభినందనీయమని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి డాక్టర్ దనసరి అనసూయ (సీతక్క) కొనియాడారు. గురువారం ములుగులోని రామాలయ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ములుగు ప్రాంతంపై కళాకారులు పాడిన అడవిగన్న ములుగు పాటను రాష్ట్ర మంత్రి సీతక్క ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ప్రజా గాయకుడు గద్దర్ వారసులు ములుగు జిల్లాలో ఉన్నారని, పాటలోనే ప్రాణంపెట్టి పాడే కళాకారులకు ములుగులో కొదువలేదని అన్నారు. మంచి పాటను ప్రజల ముందుంచిన రచయిత, నిర్మాతలు, ఎనిమిది మంది గాయకులను మంత్రి సీతక్క అభినందించారు. ఈ ములుగు ఎంతో మందిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లింది. రాజకీయాల్లో, ఉద్యమాల్లో, ఉన్నత కొలువుల్లో ఉన్నత స్థాయిలో ఉన్నారు. సీఎం చేతుల మీదుగా ఈ పాటను మళ్లీ ఒకసారి ప్రారంభిస్తామని మంత్రి సీతక్క అన్నారు. ఈ సందర్భంగా కళాకారులను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు సంగంరెడ్డి పృథ్విరాజ్, గాయకుడు వరంగల్ శ్రీనివాస్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్, ముంజాల భిక్షపతి, దారా దేవన్న, సునీల్, నరేష్, కోయిల మహేష్, పెట్టెం మల్లికార్జున్, గౌతం, రాణాప్రతాప్, రాంబాబు, కోడి వెంకటస్వామి, పాట రచయిత గడ్డం రమేష్ చంద్ర, కళా స్టూడియోస్ ప్రతినిధి కోరె అరవింద్, గాయకులు, కళాకారులు గోల్కొండ బుచ్చన్న, రాగుల శంకర్, గోల్కొండ బుచ్చన్న, పొలిపాక యాకయ్య, ఎండీ.రహీమోద్దీన్, రేలా కుమార్, మోతె రమేష్, పత్తిపల్లి రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.








