ములుగు జిల్లా లోకి ఈనెల 20 న సిపిఐ బస్సు జాతా ప్రవేశం
– జయప్రదం చేయాలని సిపిఐ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి జంపాల రవీందర్ పిలుపు
ములుగు, నవంబర్ (తెలంగాణ జ్యోతి): జిల్లాలోకి ఈనెల 20 న ప్రవేశించే సిపిఐ బస్సు జాతాను జయప్రదం చేయాలని సిపిఐ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి జంపాల రవీందర్ పిలుపునిచ్చారు. సిపిఐ పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో జరుగు తున్న శత జయంతి ప్రచార బస్సు జాతా భాగంగా ములుగు వ్యవసాయ మార్కెట్‌లో హమాలీల సంయుక్త సమావేశంలో మాట్లాడుతూ కార్మిక హక్కులు, కనీస వేతనాలు, రైతులకు గిట్టుబాటు ధర, ఉపాధి హామీ చట్టం, సమాచార హక్కు చట్టం, అటవీ హక్కుల చట్టం వంటి అనేక ప్రజాహిత చట్టాల సాధనలో సిపిఐ పార్టీ పోరాటాలపై ఆయన విశ్లేషించారు. వివిధ కాలక్షేపపు పార్టీలు కనుమరుగైన సందర్భంలో సిపిఐ పార్టీ కార్మిక, పేద, బడుగు వర్గాల మద్దతుతో శతాబ్ద కాలంగా నిలకడగా ఉన్నదని తెలిపారు. ఈనెల 20వ తేదీ ఉదయం 11 గంటలకు ములుగు కేంద్రంలో జరగనున్న జాతా కార్యక్రమానికి మాజీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కల్లపల్లి శ్రీనివాసరావు తదితర నాయకులు హాజరవనున్నందున ప్రజలు విస్తృతం గా పాల్గొని జాతాను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఎండి అంజద్ పాషా, రామన్న వాంకుడోత్, వీరన్న రొంటాల, రమేష్ యాటల, పైడి, బిక్షపతి, కుమార్ తదితరులు పాల్గొన్నారు.





