కాంగ్రెస్ అంటేనే బడుగుల పార్టీ
– ఇచ్చిన హామీలను పక్కా అమలు చేస్తాం
– మాజీ ఎంపీ కవిత అసత్య ప్రచారాలను మానుకోవాలి
– కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి, మాజీ కేంద్రమంత్రి పోరిక బలరాం నాయక్
– ములుగులో ప్రెస్ మీట్
ములుగు, తెలంగాణ జ్యోతి : కాంగ్రెస్ అంటేనే పేదల పార్టీ అని, బడుగు బలహీన వర్గాల అబివృద్ధి కోసం కృషి చేస్తుందని, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను పక్కాగా అమలు చేస్తామని మాజీ కేంద్ర మంత్రి, మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ స్పష్టం చేశారు. మాజీ ఎంపీ మాలోతు కవిత తనపై చేస్తున్న అసత్య ప్రచారాలు మానుకోవాలని సూచించారు. ములుగు గట్టమ్మ తల్లిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్న అనంతరం సోమవారం ములుగులో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బానోతు రవిచందర్ అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు దేశంకోసం అమరుల య్యారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలను పక్కాగా అమలు చేస్తామని వెల్లడించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు 2009 డిసెంబర్ 9న ఇచ్చిన హామీ మేరకు సోనియా గాంధీ తెలంగాణ ప్రకటించారని, ఇచ్చిన మాట తప్పకుండా నిలబెట్టేది కాంగ్రెస్ మాత్రమేనన్నారు. కళ్యాణలక్ష్మీ పథకాన్ని కొనసాగిస్తున్నామని, రైతు రుణమాఫీని తప్పక అమలు చేస్తామని బలరాం నాయక్ చెప్పారు. గతంలో తాను కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు మహబూబాబాద్ ఫార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో చేసిన అభివృద్ధి తన హయాంలోనే జరిగిందన్నారు. రోడ్లు, బ్రిడ్జిలు, ఆస్పత్రి తదితర పనులన్నీ తానే చేశానని వెల్లడించారు. బీఆర్ఎస్, బీజేపీలు నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. మాజీ ఎంపీ కవిత తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, నియోజకవర్గ ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో ఫైరింగ్ చేయించింది ఎవరని ప్రశ్నించారు. బీఆర్ఎస్ గత హామీలను ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. ప్రాజెక్టుల పేరుతో రాష్ర్టాన్ని దోచుకున్నారని, లక్షల కోట్ల అప్పులు మిగిల్చారన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలోని ఆర్థిక విధానాలతో దేశం ఇప్పుడు ఈవిధంగా ఉందని, బీజేపీ చేసిందేమీ లేదన్నారు. రానున్న రోజుల్లో ఇందిరమ్మ ఇండ్లు, గ్యాస్, పెట్రోల్ ధరలు తగ్గిస్తామని బలరాం నాయక్ తెలిపారు. తనకు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిపినందుకు సోనియాగాంధీ, రాహుల్ గాందీ, ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎండీ.చాంద్ పాషా, పట్టణ అధ్యక్షుడు చింతనిప్పుల భిక్షపతి, ఎంపీటీసీ మావురపు తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ జిల్లా నాయకులు నూనేటి శ్యాం, నల్లెల్ల భరత్ కుమార్, ఇమ్మడి రాజు యాదవ్, పౌడాల ఓం ప్రకాష్, షర్ఫుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.