ములుగులో కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ములుగు, డిసెంబర్ 28, తెలంగాణ జ్యోతి : భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవాన్ని ములుగు జిల్లా కేంద్రంలో శనివారం ఉత్సాహంగా నిర్వహించారు. రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ములుగు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చింతనిప్పుల బిక్షపతి నేతృత్వంలో పార్టీ శ్రేణులు జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్, పంచాయతీ రాజ్ శాఖ రాష్ట్ర డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్య సాధనలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు. ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ఆశయమని పేర్కొంటూ, తెలంగాణ రాష్ట్ర సాధనలోనూ కాంగ్రెస్ చేసిన కృషిని వివరించారు. పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రతి కార్యకర్తకు గర్వకారణమని తెలిపారు. వేడుకల అనంతరం కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చడాన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. పార్లమెంటులో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడాన్ని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా తప్పుబట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజా సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేసే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా స్థాయి కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






