Congress | కాంగ్రెస్ సర్కార్ ఖాయం : రాహుల్ గాంధీ

Congress | కాంగ్రెస్ సర్కార్ ఖాయం : రాహుల్ గాంధీ

  • రాబోయేధీ కాంగ్రెస్ శకం…
  • బీఆర్ఎస్, బిజెపి, ఎంఐఎం పార్టీలపై విసర్లు 
  • భూపాలపల్లి, కాటారం, కొయ్యూరులలో బస్సు యాత్ర
  • కాటారం కార్నర్ మీట్ లో జోష్ గా ప్రసంగించిన రాహుల్ గాంధీ 
  • మేడిపల్లి నుంచి గారేపల్లి వరకు భారీ బైక్ ర్యాలీ 
  • రాహుల్ ప్రసంగాన్ని అనువదించిన శ్రీధర్ బాబు 

తెలంగాణ జ్యోతి , కాటారం ప్రతినిధి: ప్రజల సంతోషాన్ని చూస్తుంటే రాబోయే రోజుల్లో రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ సర్కార్ రావడం ఖాయమనిపిస్తుందని కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గారేపల్లి కార్నర్ మీటింగ్ లో రాహుల్ గాంధీ సుదీర్ఘంగా ప్రసంగించారు. రాహుల్ గాంధీ ప్రసంగాన్ని తెలుగులోకి మంథని శాసనసభ్యులు, ఏఐసీసీ కార్యదర్శి దుద్దిల్ల శ్రీధర్ బాబు అనువాదం చేశారు. బుధవారం ములుగు జిల్లా, రామప్ప దర్శనం, బస్సు యాత్ర తర్వాత, రాత్రి భూపాలపల్లి జెన్కో గెస్ట్ హౌస్ లో బసచేసిన రాహుల్ గాంధీ గురువారం ఉదయం తన బస్సు యాత్రను ప్రారంభించారు. భూపాలపల్లి పట్టణంలో అక్కడి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు తో కలిసి ఆయన బస్సు యాత్రలో పాల్గొన్నారు. జిల్లా సరిహద్దుల్లోని మంథని నియోజకవర్గం ప్రారంభం గ్రామమైన మేడిపల్లి నుంచి మంథని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే, దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ కొనసాగింది. శ్రీధర్ బాబు సహోదరుడు దుదిల్ల శీను బాబు ఆధ్వర్యంలో భారీ ఎత్తున బైక్ ర్యాలీ చేపట్టారు. దారి పొడవునా మహిళలు కోలాటాలు, ప్రదర్శనలు చేస్తూ మంగళ వాయిద్యాలతో పూల వర్షం కురిపించారు. కాటారం మండలం గారేపల్లిలో కాంగ్రెస్ పార్టీ విజయ యాత్ర లో భాగంగా బస్సు కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. బస్సు పైన రాహుల్ గాంధీ మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించిందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తాము ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించినప్పటికీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఒకే కుటుంబం అధికారాన్ని అనుభవిస్తుందని, అవినీతికి పాల్పడుతూ అరాచకపు పాలనను కొనసాగిస్తుందని రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పేద ప్రజల సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రజలు కోరుకుంటుంటే తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు దూరంగా వెళ్లిపోతున్నాడని దుయ్యబట్టారు. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ , రాష్ట్రంలోని భారత రాష్ట్ర సమితి మరో పార్టీ ఎంఐఎంలు మూడు పార్టీలు సైతం ఒకే తాను ముక్కల్లాగా వ్యవహరిస్తు న్నాయని ఆరోపించారు. తాను ప్రజా సంక్షేమానికై భారత్ జోడో యాత్ర ప్రారంభించి దేశవ్యాప్తంగా ప్రజా సమస్యలను గుర్తించామని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా సమస్యలను తీర్చేందుకు ప్రథమ ప్రాధాన్యతను ఇస్తామని రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో ఎన్నికలలో సైతం ప్రజల ఆదరాభిమానాలు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నాయని, రాబోయేది కాంగ్రెస్ శకం అని రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. కేసీఆర్ కుటుంబం అనేక అవినీతి కి పాల్పడుతూ కోట్లాది రూపాయల సంపదను దోచుకు తింటున్నదని దుయ్యపట్టారు. కేంద్రంలోని బిజెపి పార్టీ బీఆర్ఎస్ నేతలపై, కేసీఆర్ కుటుంబం పై ఈడీ, సీబీఐ ల చేత అవినీతిపై విచారణలు ఎందుకు చేయడం లేదని రాహుల్ గాంధీ సూటిగా ప్రశ్నించారు. ప్రజలను అయోమయానికి గురి చేస్తూ భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితిలో రాజకీయ ఒప్పందాలను కుదుర్చుకొని వివరిస్తున్నాయని ఆరోపించారు. రాబోయే రోజుల్లో అన్ని అవినీతిలపై సమగ్ర దర్యాప్తు చేపడతామని, సంపదను దోచుకున్న వారిని విడిచి పెట్టేది లేదని ప్రజల హర్షద్వనాల మధ్య ప్రకటించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా తాము ప్రజాయాత్రలతో ప్రజలతో మమేకమై ఉంటుంటే, సహించలేని బిజెపి పార్టీ తన పార్లమెంటు సభ్యత్వాన్ని సైతం రద్దు చేసిందని, అయినప్పటికీ ప్రజల వెంటే తామున్నామని రాహుల్ గాంధీ వివరించారు. ఇందిరాగాంధీ, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లకు దేశ ప్రజలతో ఉన్న సంబంధం కుటుంబ పరివార బంధం అని రాజకీయ బంధం కాదని అన్నారు. భారతీయ వారసత్వ సంపద గా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంలో తన చెల్లి ప్రియాంక గాంధీ తో పాటు పూజలు చేసి, కాంగ్రెస్ పార్టీ విజయ యాత్రను ప్రారంభించామని, రాబోయే రోజుల్లో దసరా తర్వాత తెలంగాణలో సైతం ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ పర్యటనలు ఉంటాయని రాహుల్ గాంధీ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో ఓకే కుటుంబ పరిపాలనను అంతమొందించాల్సిన అవసరం ఉందని, కెసిఆర్ ప్రభుత్వాన్ని గద్దే దించాల్సిన సమయం ఆసన్నమైందని రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారంటీ పథకాలతో అధికారాన్ని అందుకోబోతున్నామని, ప్రజలందరికీ సేవలు అందించడానికి కాంగ్రెస్ పార్టీ రాబోతుందని రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, హస్తం గుర్తుకు ఓటెయ్యాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. బస్సు పైకి ఎక్కి రాహుల్ గాంధీకి కాలేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవస్థానం ఛాయాచిత్రాన్ని శ్రీధర్ బాబు సహోదరుడు, శ్రీపాదరావు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శ్రీనుబాబు అందజేశారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క, మంథని శాసనసభ్యులు, ఏఐసీసీ కార్యదర్శి దుద్దిల్ల శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమునూరి ప్రభాకర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీమల సందీప్, ఎంపీపీ పంతకాని సమ్మయ్య, వైస్ ఎంపీపీ సీర్ల తిరుమల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కోట రాజబాబు గౌడ్, ఉప సర్పంచ్ నాయిని శ్రీనివాస్, ఎంపీటీసీ, మహిళా అధ్యక్షురాలు జాడి మహేశ్వరి, పీసీసీ ఉపాధ్యక్షులు గద్దె సమ్మిరెడ్డి, పిసిసి మహిళా రాష్ట్ర కార్యదర్శి ఆంగోతు సుగుణ, మహాదేవపూర్ ఎంపీపీ బాన్సువాడ రాణి భాయ్ మహా ముత్తారం జడ్పిటిసి లింగమల్ల శారద,కుంభం స్వప్న రెడ్డి, రమేష్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి మహిళా విభాగం డాక్టర్ ఏలుబాక సుజాత, కాంగ్రెస్ పార్టీ నాయకులు చీర్ల తిరుపతిరెడ్డి, అజ్మీర రఘురాం నాయక్, మహేష్ రవీందర్రావు, కొట్టే ప్రభాకర్, అంగజాల అశోక్, సాయి, విక్రమ్, నరేష్ పలువురు పాల్గొన్నారు.

గారేపల్లి నుంచి బస్సు యాత్ర మలహర్ మండలం కొయ్యూరు మీదుగా మంథని పట్టణం పెట్రోల్ పంప్ వద్ద కార్నర్ మీటింగ్ అనంతరం కమాన్ పూర్ మండలం జేఎన్టీయూ కాలేజీ వద్ద లంచ్ అనంతరం సింగరేణి కార్మికులతో గేట్ మీటింగ్ అక్కడి నుంచి బస్సు యాత్రలో పెద్దపళ్లి వరకు చేరుకొని అక్కడ బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తారు. శుక్రవారం కరీంనగర్ నుంచి నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment