ఆదివాసీలకు స్ఫూర్తి శిఖరం బిర్సా ముండా
– ఘనంగా బిర్సా ముండా జయంతి వేడుకలు
వెంకటాపురం, నవంబర్ 15, తెలంగాణ జ్యోతి : గొండ్వాన సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివాసీ హక్కుల తొలి పోరాట యోధుడు బిర్సా ముండా 150వ జయంతి వేడుకలను ములుగు జిల్లా వెంకటాపురం మండలం కమ్మరిగూడెం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. గొండ్వాన సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి, జిల్లా అధ్యక్షుడు పూనెం ప్రతాప్ లు పాల్గొని బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ నాడు బ్రిటిష్ అరాచకాలను ఎదిరించి ఆదివాసీల హక్కుల కోసం అఖండ పోరాటం సాగించిన యోధుడు బిర్సా ముండా అని గుర్తుచేశారు. చిన్న వయస్సు లోనే కన్నుమూసినా, తన పోరాట పటిమతో ఆంగ్లేయులకు చెమటలు పట్టించిన మహావీరుడిగా చరిత్రలో నిలిచిపోయాడన్నారు. బ్రిటిష్ దాష్టికాలను ఎండగట్టి ఆదివాసీలను ఒకతాటిపైకి తెచ్చి చైతన్య వంతులను చేసిన మహానేతగా బిర్సా ముండా పేరొందాడని చెప్పారు. ఆదివాసీ ప్రతిఘటన బలాన్ని గుర్తించిన బ్రిటిష్ పాలకులు ఆయన్ను అరెస్టు చేసి విషప్రయోగం చేసి హతమార్చిన విషాదకర సంఘటనను స్మరించారు. ఆయన వీరత్వం, ధైర్యం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, ఆయన చూపించిన దారిలోనే ఆదివాసీ హక్కుల కోసం కంకణం కట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గొండ్వాన గ్రామ పెద్దలు పూనెం నాగేశ్వరరావు, పర్షిక మోహనరావు, కార్యకర్తలు పర్షిక బాబురావు, వెంకటేశ్, దిలీప్, రాజేష్, పార్థు, జస్వంత్, సబక సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.





