Bharathi/Dharani | భూ సమస్యల పరిష్కారానికి ఏప్రిల్ వరకూ గడువు..!
హైదరాబాద్, జనవరి7 (తెలంగాణ జ్యోతి): తెలంగాణలో భూ సమస్య లతో ఇబ్బందులు పడుతున్న రైతులకు సర్కార్ కీలక ఊరటనిచ్చింది. ధరణి పోర్టల్‌లోని సాంకేతిక, రికార్డు పరమైన తప్పుల సవరణకు గడువు ను 2026 ఏప్రిల్ 13 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి భూభారతి కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ధరణిలో నమోదైన సుమారు 2.45 లక్షల పెండింగ్ దరఖాస్తులు ఇప్పటికే పరిష్కరించినప్పటికీ, నిషేధిత జాబితా, సర్వే నంబర్ తప్పులు, విస్తీర్ణ తేడాల వంటి సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయి. రైతుల విజ్ఞప్తి మేరకు మరో అవకాశం ఇచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది.
భూభారతి కింద గ్రామస్థాయిలో ప్రత్యేక రెవెన్యూ సదస్సులు, రీ-సర్వే ద్వారా భూ రికార్డుల డిజిటలైజేషన్ చేపట్టనున్నారు. రైతులు మీ-సేవ కేంద్రాలు లేదా భూభారతి పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు సూచించారు. ఈ గడువు పొడిగింపుతో భూ వివాదాలు తగ్గి, భూముల క్రయవిక్రయాలు పెరిగి రైతులకు, ప్రభుత్వ ఖజానాకు మేలు జరుగుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు.







