బెట్టింగ్ ముఠా గుట్టురట్టు
– ఏడుగురి అరెస్టు, పరారీలో తొమ్మిది మంది
– బెట్టింగ్ నిర్వాహకులు మహారాష్ట్ర వాసులు
– వివరాలు వెల్లడించిన సీపీ సాయిచైతన్య
నిజామాబాద్ ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : యువకులను టార్గెట్ గా చేసుకొని బెట్టింగ్ యాప్ లు నడుపుతున్న క్రికెట్ బెట్టింగ్ ముఠాను అరెస్టు చేసినట్లు నిజామాబాద్ పోలీసు కమిషనర్ సాయిచైతన్య తెలిపారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేక రుల సమావేశంలో సీపీ మాట్లాడుతూ మహారాష్ర్టకు చెందిన వారు బెట్టింగ్ లు నిర్వహిస్తుండగా ఇక్కడి వారు ఏజెంట్లు, సబ్ ఏజెంట్లుగా పని చేస్తున్నారని, నిజామాబాద్, ఆర్మూర్ లో మొత్తం ఏడుగురిని పోలీసులు అరెస్టు చేయగా, తొమ్మిది మంది పరారీలో ఉన్నారని సీపీ తెలిపారు. నిజామాబాద్ నగరంలోని ఐదో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న భారతీరాణి కాలనీలో ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు నార్త్ రూరల్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్, టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్ అంజయ్య, ఐదో టౌన్ ఎస్సైలు గంగాధర్, లక్ష్మయ్య సిబ్బందితో కలిసి దాడి చేశారు. తన ఇంటి వద్దే సెల్ ఫోన్ లలో బెట్టింగ్ నిర్వహిస్తున్న షేక్ ముజీబ్ అహ్మద్ తోపాటు షేక్ నదీం, షేక్ జునైద్, షేక్ రెహాన్ లను అదపులోకి తీసుకున్నారు. సాలూరాకు చెందిన షకీల్, నిజామాబాద్ ఆటోనగర్ కుచెందిన షేక్ నజీబ్, మహారాష్ర్టలోని ధర్మాబాద్ కు చెందిన సచిన్, ఆరెంజ్ ట్రావెల్స్ లో పనిచేసే నిజామాబాద్ కు చెందిన రమేశ్ పరారీలో ఉన్నారు. ఏ1గా ఉన్న షేక్ ముజీబ్ అహ్మద్ పై గతం లో గేమింగ్ చట్టం ప్రకారం కేసులున్నట్లు సీపీ తెలిపారు. ఆర్మూర్ లో ఏసీపీ వెంకటేశ్వర్రెడ్డి, సీఐ సత్యనారాయణ, ఎస్సై మహేశ్ ఆధ్వర్యంలో సిబ్బంది దాడి చేసి బెట్టింగ్ ఆడుతున్న గట్టడి వడ్డ గౌతమ్, దయాల్ సునీల్ , జాజు రంజిత్ లని అరెస్టు చేశారు. గట్టడి శ్రీకాంత్ తోపాటు హర్యానాకు చెందిన విపుల్ మంగ్, మహారాష్ర్టకు చెందిన బంటు పలాస్, బబ్లూ ఠాకూర్, వినా యక్ పరారీలో ఉన్నారు. నిజామాబాద్, ఆర్మూర్ లో పట్టు బడిన వారి నుంచి పోలీసులు నగదు, సెల్ ఫోన్ లు, బ్యాంక్ పాస్ పుస్తకాలు, క్రెడిట్, డెబిట్ కార్డులు, ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్, ఆర్మూర్ లో పట్టుబడిన వారిని పోలీసులు విచారించగా బెట్టింగ్ మూలాలు మహారాష్ర్ట లో ఉన్నట్లు తేలింది. అక్కడి వారే స్థానికులను ఏజెంట్లుగా, సబ్ ఏజెంట్లుగా నియమించుకుని యువతను బెట్టింగ్ ఊబిలోకి దింపుతున్నా రని,ఇప్పటి వరకు 1200మంది యువత యూజర్ ఐడీలు, పాస్ వర్డ్ లు పొందినట్లు తెలిసింది. నాందేడ్ జిల్లా ధర్మాబాద్ కు చెందిన సచిన్ అనే వ్యక్తి క్రికెట్ బెట్టింగ్ కు మాస్టర్ గా ఉండగా, అతనిపైన మరోవ్యక్తి సూపర్ మాస్టర్ గా ఉన్నా డని, మాస్టర్ కింద బుకీ గా ఉండాలని నిజామాబాద్ నగరానికి చెందిన పలువురికి యూజర్ ఐడీలు పాస్ వర్డ్ లు ఇచ్చినట్లు సీపీ తెలిపారు. నేరస్థులను పట్టుకోవడంలో కృషి చేసిన ఆర్మూర్ సి.ఐపి. సత్యనా రాయణ,టాస్క్ ఫోర్స్ సిఐ అంజయ్య, నిజామా బాద్, ఆర్మూర్ ఎస్.ఐలు, ఆర్మూర్ పోలీసు సిబ్బంది, టాస్క్ ఫోర్స్ సిబ్బందిని పోలీస్ కమీషనర్ సాయి చైతన్య రివార్డులు ఇచ్చి అభినందించారు.