గ్రామాల్ని నాశనం చేస్తున్న బెల్ట్ షాపులు.. మద్యం మాఫియా హవా..!
వైన్స్ అండతో బెల్ట్ షాపుల దందా… ఎక్సైజ్ మౌనమెందుకు?
కన్నాయిగూడెం, డిసెంబర్ 23, తెలంగాణ జ్యోతి : గుర్రెవుల గ్రామాల తో పాటు కన్నాయిగూడెం మండలంలోని పలు గ్రామాల్లో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులు జోరుగా కొనసాగుతూ మద్యం ఏరులై పారుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి గ్రామానికి మెడికల్ షాప్ ఉందో లేదో గానీ, వీధికొక బెల్ట్ షాప్ ఉందంటే అతిశయోక్తి కాదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడో ఎన్నికల సమయంలో లేదా అరుదుగా నామమాత్రపు చర్యలు తీసుకుంటున్న ఎక్సైజ్ శాఖ, ఆ తరువాత బెల్ట్ షాపుల నిర్వాహకులకు సహకరిస్తు న్నట్లుగా వ్యవహ రిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రోత్సహిస్తున్న వైన్స్ నిర్వాహకులు…
కన్నాయిగూడెం మండల కేంద్రంలోని మసీదు సమీపంలో రెండు చోట్ల బెల్ట్ షాపులు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ బెల్ట్ షాపుల నిర్వాహకులు వైన్స్ షాపుల నుంచి ద్విచక్ర వాహనాలపై మద్యం తరలిస్తున్నట్లు సమాచారం. అధిక ధరలకు విక్రయిస్తున్నప్పటికీ వినియోగదారులు బెల్ట్ షాపుల నుంచే మద్యం కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ అక్రమ వ్యాపారానికి వైన్స్ నిర్వాహకులు కొండంత అండగా నిలుస్తూ “మీ దగ్గరకు ఎవరూ రారు… మేమే చూసుకుంటాం” అంటూ భరోసా ఇస్తున్నా రన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు ప్రతిఫలంగా ఒక్కో బీరు, మద్యం సీసాపై రూ.10 నుంచి రూ.30 వరకు వసూలు చేస్తున్నారని, బెల్ట్ షాపులు వినియోగదారుల నుంచి ఒక్కో సీసాకు రూ.30 నుంచి రూ.50 వరకు వసూలు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇళ్లలోనే విచ్చలవిడిగా బెల్ట్ షాపులు…
ఒకప్పుడు గ్రామానికి రెండు మూడు బెల్ట్ షాపులు రహస్యంగా నడిచేవి. ప్రస్తుతం మాత్రం అవి విచ్చలవిడిగా కొనసాగుతూ ఏకంగా ఇళ్లలోనే మద్యం అమ్మకాలు జరుపుతున్నాయి. ఏ రాత్రి వెళ్లినా మద్యం లభిస్తుండటంతో గ్రామాల్లో సామాజిక సమస్యలు పెరుగుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పుడప్పుడూ ఆబ్కారీ శాఖ చేపడుతున్న దాడులు కేవలం నామమాత్రంగానే ఉండటంతో అధికారులు కన్నెత్తి చూడడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖ అధికారులు అక్రమ బెల్ట్ షాపులపై కఠిన చర్యలు తీసుకుంటారా? లేక ఇదే పరిస్థితి కొనసాగుతుందా? అన్నది వేచి చూడాల్సి ఉంది.






