అసాంఘిక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
-గ్రామీణ యువత ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ముందుకు సాగాలి
– ఏటూరునాగారం ఏ .ఎస్. పి. శివం ఉపాధ్యాయ
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : అసాంఘిక శక్తు ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వారి మాయమాటలతో వలలో పడవద్దని, గ్రామీణ యువత విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాలలో ముందుకు సాగాలని ఏ.ఎస్.పి. శివం ఉపాధ్యాయ అన్నారు. శనివారం ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరిధిలోని, తిప్పాపురం జి.పి.లోని పెంకవాగు, అటవీ గ్రామాల ఆదివాసీలతో ఏ.ఎస్.పి. వారి సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. కార్టన్ అండ్ సర్చ్ లో భాగంగా రెండు గ్రామాల ఆదివాసీలను కలుసుకొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో అటవీ గ్రామాల్లో అపరిచిత వ్యక్తులు సంచరిస్తుంటారని, అటు వంటి అసాంఘిక శక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియ పరచాలని కోరారు. గ్రామీణ యువత క్రీడలు, విద్యా, ఉద్యోగం పట్ల ఆసక్తి చూపాలన్నారు. క్రీడలు దేహదారుడ్యాన్ని, స్నేహ సంబంధాలను పెంపోందిస్తాయని తెలిపి యువతకు వాలీబాల్ కిట్లను పంపిణీ చేశారు. అలాగే గ్రామాల్లో ఏమన్నా సమస్యలు నెలకొని ఉంటే పోలీస్ శాఖకు తెలియపరచాలని, వాటిని సంబంధిత ప్రభుత్వ శాఖలకు తెలియపరచి, ప్రభుత్వపరమైన సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ప్రభుత్వం అమలు పరుస్తున్న గిరిజన సంక్షేమ చట్టాలను, సంక్షేమ పదకాల పై అవగాహనతో సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ డిఎస్పి సతీష్, వెంకటాపురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ కే. తిరుపతి రావు, ఆలుబాక సీఆర్పీఎఫ్ సిబ్బంది, సివిల్ పోలీసులు పాల్గొన్నారు.