సుబ్బక్కపల్లి, రామ్ నాయక్ తండలో మాదకద్రవ్యాలపై అవగాహన
– ప్రజల్లో జాగృతి పెంచాల్సిన అవసరం : ఏఎస్ఐ వేణుగోపాల్
వెంకటాపూర్, నవంబర్ 18, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా ఎస్పీ శబరిష్ ఆదేశాల మేరకు, వెంకటాపూర్ ఎస్సై చల్ల రాజు సూచనలతో సుబ్బక్కపల్లి, రామ్ నాయక్ తండ గ్రామపంచాయతీలలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నివారణపై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఇంచార్జ్ ఏఎస్ఐ వేణు గోపాల్ ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి చేపట్టారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ వేణుగోపాల్ మాట్లాడుతూ, యువత మాదకద్రవ్యాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోకుండా తల్లిదండ్రులు, పెద్దలు పిల్లల ప్రవర్తన ను గమనిస్తూ సమయానికి హెచ్చరించాలని సూచించారు. ఎవరికైనా మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసినా వెంటనే పోలీసుల కు తెలియజేయాలని, వారి వివరాలు పూర్తి గోప్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చారు. మాదకద్రవ్యాల రహిత గ్రామాల సృష్టికి అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో యువకులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.






