పొగమంచు కారణంగా రాత్రి, తెల్లవారుజామున ప్రయాణాలు చేయకండి
– ఏటూరునాగారం ఎస్.ఐ రాజ్‌కుమార్
ఏటూరునాగారం, నవంబర్ 17 (తెలంగాణ జ్యోతి): ఏటూరునాగారం లో వాతావరణంలో పొగమంచు తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో, రాత్రి మరియు తెల్లవారుజామున ప్రయాణాలు చేయకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్.ఐ రాజ్‌కుమార్ సూచించారు. పొగమంచు కారణంగా రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు, పాదచారులను గుర్తించే వీక్షణ సామర్థ్యం గణనీయంగా తగ్గిపోతుందని చెప్పారు. ఈ సమయంలో చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉన్నందున, అత్యవసరమైతే తప్ప రాత్రి, తెల్లవారుజామున ప్రయాణాలు చేయొద్దని ప్రజలను ఆయన హెచ్చరించారు. అలాగే దట్టమైన పొగమంచు సమయంలో వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. వాహనాలను వేగంగా నడపకూడదని, పూర్తిగా శ్రద్ధతో, నిదానంగా ప్రయాణించాల్సిందిగా కోరారు. తక్కువ వీక్షణ కారణంగా ఇతర వాహనాలు, పాదచారులు, మలుపులు, రోడ్డు విభజన స్పష్టంగా కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నందున హెడ్‌లైట్లను లో బీమ్‌లో ఉంచి, ఫాగ్ లైట్లు వాడాలన్నారు.





