ఓసి కమిషన్ ఏర్పాటు చేయాలి : పోలాడి రామారావు
ఈనెల 11 న వరంగల్ సింహగర్జన సభను విజయవంతం చేయాలి.
కాటారం, జనవరి 04, (తెలంగాణ జ్యోతి) : ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పటిష్ట అమలుకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఓసి కమిషన్ ఏర్పాటు చేయాలని పలువురు ఓసి ఐకాస నాయకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. జనవరి 11న వరంగల్ లో నిర్వహించ తలపెట్టిన ఓసి ల సింహగర్జన సభ ఏర్పాట్లపై ఆదివారం కాటారం లో నిర్వహించిన భూపాలపల్లి జిల్లా స్థాయి ఓసి ఐకాస నాయకుల సన్నాహక సమావేశంలో రెడ్డి, వెలమ, వైశ్య, బ్రాహ్మణ సామాజిక వర్గీయులు హాజరయ్యారు. ఈసందర్భంగా ఓసి సామాజిక సంక్షేమ సంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావుతో పాటు ఐకాస నాయకులు మాట్లాడుతూ ఈడబ్లూఎస్ సర్టిఫికెట్ జారీకి షరతులు లేని 5 ఏళ్ల కాలపరిమితి కలిగి ఉండేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు విద్యా ఉద్యోగ పోటీ పరీక్షల వయోపరిమితి పెంచాలని, ఈడబ్లూఎస్ వారికి కేటాయించిన మిగిలి పోయిన బ్యాక్ లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ జారీకి వార్షిక ఆదాయ పరిమితి 10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. టెట్ రాత పరీక్ష అర్హతకు 90 మార్కుల నుంచి 70 మార్కులకు తగ్గించాలని , కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను వర్తింప చేయాలని కోరారు. తమ డిమాండ్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టికి తీసుకెళ్ళేందుకోసం జనవరి 11 న సాయంత్రం 3 గంటలకు హన్మకొండ లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్ లో లక్ష మందితో నిర్వహించే రాష్ట్ర స్థాయి ఓసి ల సింహగర్జన భారీ బహిరంగ సభకు ఓసి లంతా రాజకీయాల కతీతంగా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఐకాస జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ఐకాస నాయకులకు పిలుపు నిచ్చారు. సింహగర్జన బహిరంగ సభకు సంబంధించిన వాల్ పోస్టర్, కరపత్రాలను ఐకాస నాయకులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం లో భూపాలపల్లి ఓసి జేఏసీ జిల్లా అధ్యక్షుడు మందల రాజిరెడ్డి, ఐకాస రాష్ట్ర నాయకులు జనగామ కరుణాకర్ రావు, గుడాల శ్రీనివాస్, మండల జే ఏ సి అధ్యక్షుడు ఆనంతుల రమేష్ బాబు, వాల యాదగిరి రావు, మహేష్ రవీందర్ రావు, ఎం రవి శంకర్ రెడ్డి, ఉన్నం అంజయ్య, అయిలినేని నవీన్ రావు, కే. శ్రీనివాస్, సరేన్ రావు, ఎం ఎల్ ఎన్ మూర్తి, మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మద్ది నవీన్ కుమార్ కముటాల రవీందర్ తో పాటు వివిధ మండలాల ఐకాస నాయకులు పాల్గొన్నారు.






