ఏజెన్సీలో నేతకాని కులాలకు సర్వ హక్కులు ఇవ్వాలి
జనవరి 12న ములుగు జిల్లా కేంద్రంలో నిరసన
ములుగు, జనవరి 8 (తెలంగాణ జ్యోతి): ఏజెన్సీలో నేతకాని కులాలకు సర్వ హక్కులు ఇవ్వాలని ఈనెల 12న ములుగులో నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు నేతకాని సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు జమున రాజు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని నేతకాని కులస్తులకు భూమిపై భుక్తి హక్కులు కల్పించాలని, ఏజెన్సీ చట్టాలను సమగ్రంగా అమలు చేయాలని, అలాగే ఏజెన్సీ నేతకాని అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జనవరి 12న ములుగు జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కుల సంఘాలకు అతీతంగా నేతకాని కులస్తుల ఐక్యతతో ములుగు జిల్లా కేంద్రంలోని వద్ద ‘జై నేతకాని’ నినాదాలతో శాంతియుత నిరసన చేపడతామని తెలిపారు. అనంతరం ములుగు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి క్యాంపు కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి, ఏజెన్సీ ప్రాంతాల్లో నేతకాని కులాలకు సర్వ హక్కులు కల్పించాలని వినతిపత్రం సమర్పిస్తామని చెప్పారు. నేతకాని కులస్థులందరూ “మేము సైతం” అంటూ హక్కుల సాధన కోసం ఈ నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలిరావాలని జమున రాజు పిలుపునిచ్చారు.






