మేడారం జాతరకు సర్వం సిద్ధం – 20లోపు సీఎం పర్యటన
• రూపుమారిన సమ్మక్క–సారలమ్మ ఆలయ ప్రాంగణం
• 200 ఏళ్లు చెక్కుచెదరని రాతి నిర్మాణాలు
• మేడారంలో రాత్రి బస చేయనున్న ముఖ్యమంత్రి
• రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ములుగు/మేడారం (తెలంగాణ జ్యోతి): ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరకు అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. అమ్మవార్ల ఆలయ పునరుద్ధరణ పనులు తుది దశకు చేరుకున్నాయని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 20వ తేదీలోపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారంలో పర్యటించి, అభివృద్ధి పనులను లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు. శనివారం మేడారంలో పర్యటించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముందుగా మంత్రి సీతక్క తో కలిసి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జాతర ఏర్పాట్లపై మీడియాతో మాట్లాడారు. ప్రారంభోత్సవానికి ఒక రోజు ముందే ముఖ్యమంత్రి మేడారానికి చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారని, మరుసటి రోజు ఉదయం పునరుద్ధరించిన ఆలయ కట్టడాలను జాతికి అంకితం చేస్తారని చెప్పారు.
200 ఏళ్లకు నిలిచేలా రాతి నిర్మాణం
పునరుద్ధరణ పనులను ప్రభుత్వం ఒక సవాలుగా స్వీకరించిందని మంత్రి పేర్కొన్నారు. రాబోయే రెండు శతాబ్దాల పాటు చెక్కుచెదరని విధంగా, పూర్తిగా రాతితో ఆలయ నిర్మాణాలను చేపట్టినట్లు తెలిపారు. తక్కువ సమయంలోనే ఇంత భారీ పనులను పూర్తి చేయడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.

రికార్డు స్థాయిలో భక్తుల రాక అంచనా
ఈసారి జాతరకు తెలంగాణతో పాటు దేశం నలుమూలల నుంచి గతంలోకన్నా అధికంగా కోట్లాది మంది భక్తులు తరలివచ్చే అవకాశ ముందని మంత్రి అంచనా వేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత, తాగునీరు, వైద్య సేవలు తదితర ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి సీతక్క నిత్యం మేడారంలోనే ఉంటూ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని కొనియాడారు. జాతర ఏర్పాట్లకు సహకరిస్తున్న మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు మీడియాకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.






