వసంత పంచమి సందర్భంగా అక్షరాభ్యాసం
విద్యాభ్యాసానికి ఇదే తొలి అడుగు: స్కూల్ యాజమాన్యం
ములుగు, ఫిబ్రవరి (తెలంగాణ జ్యోతి) : వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్, వివేకవర్ధిని హై స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో నూతనంగా పాఠశాలకు చేరుతున్న చిన్నారుల కోసం అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భారతీయ సంప్రదాయానికి అనుగుణంగా వేద పండితుల మంత్రోచ్ఛార ణలు, ఆశీర్వచనాల నడుమ చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించి విద్యాభ్యాసానికి శుభారంభం కల్పించారు. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం చిర్రా నరేష్ గౌడ్, ముద్ధం సంతోష్ చక్రవర్తి మాట్లాడుతూ వసంత పంచమి విద్యారంభానికి ఎంతో శుభదాయకమైన రోజని, ఈ రోజున అక్షరాభ్యాసం చేయడం పిల్లల భవిష్యత్తుకు మేలుకలిగిస్తుందని పేర్కొన్నారు. అక్షరాభ్యాసం గావించిన చిన్నారులకు, వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో పాఠశాలల ప్రిన్సిపల్ ఎస్.ఎన్. హరి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక వాతావరణంలో విజయవంతం చేశారు.







