మేడారం జాతర ట్రాఫిక్ పై ముందస్తు చర్యలు
మల్లంపల్లి బ్రిడ్జి పనులపై ఎస్పీ ప్రత్యేక దృష్టి
ములుగు, జనవరి5, (తెలంగాణ జ్యోతి): మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరను దృష్టిలో పెట్టుకుని భక్తులకు రవాణా ఇబ్బందులు తలెత్త కుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో మల్లంపల్లి బ్రిడ్జి నిర్మాణ పనులను జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామనాధ్ స్వయంగా పరిశీలించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. జాతర సమయం లో దేశం నలుమూలల నుంచి లక్షలాది భక్తులు మేడారం తరలివచ్చే అవకాశముండటంతో, బ్రిడ్జి పనులు ఆలస్యం కాకుండా అత్యంత వేగంగా పూర్తి చేయాలని జాతీయ రహదారి శాఖ అధికారులను ఎస్పీ ఆదేశించారు. ముఖ్యంగా వాహన రాకపోకలు సాఫీగా సాగేందుకు అవసర మైన తాత్కాలిక మార్గాలు, భద్రతా చర్యలను కూడా సమాంతరంగా అమలు చేయాలని సూచించారు. బ్రిడ్జి పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తామని, అవసరమైతే మళ్లీ స్వయంగా తనిఖీ నిర్వహిస్తానని ఎస్పీ తెలిపారు. స్థానిక సీఐ, ఎస్సైలు తరచూ పనుల స్థితిగతులను పరిశీలించి తనకు నివేదికలు అందించాలని ఆదేశించారు. భక్తుల భద్రతే ప్రథమ లక్ష్యంగా అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ తనిఖీ కార్యక్రమంలో జాతీయ రహదారి శాఖ డీఈ కిరణ్ కుమార్, ఏఈ చేతన్, ములుగు సీఐ సురేష్, ప్రొబేషనరీ ఎస్సై చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.






