ఆదివాసీ టీచర్స్ ఫెడరేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ
వెంకటాపురం నూగూరు, జనవరి 24 (తెలంగాణ జ్యోతి): ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని చిరుతపల్లి ఆశ్రమ ఉన్నత పాఠశాలలో శనివారం మండల విద్యాశాఖాధికారి జీవివి సత్యనారాయణ, హెడ్మాస్టర్ ఎం. సోమ్లా నాయక్‌ల చేతుల మీదుగా ఆదివాసీ టీచర్స్ ఫెడరేషన్ నూతన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి సపక నాగరాజు మాట్లాడుతూ ఉద్యోగులకు తక్షణమే పీఆర్సీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆసియా ఖండంలోనే ఆదివాసీ (గిరిజన) కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 28, 29, 30 తేదీల్లో మూడు రోజులు సెలవులు ప్రకటించాలని కోరారు. అలాగే నూతన పింఛన్ విధానాన్ని రద్దు చేసి, పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పేరే జానకిరావు, యు. రాంబాబు, ఎట్టీ బాబురావు, పి. నాగేశ్వరరావు, బి. జయరాం, బి. జీవనజ్యోతి, ఎ. భాగ్యలక్ష్మి, టి. వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.






