అడవిగన్న ములుగు పాట పోస్టర్ ఆవిష్కరణ
చారిత్రక ములుగు మీద తొలి పాట
– మంత్రి సీతక్క అభినందనలు
ములుగు, జనవరి4, తెలంగాణ జ్యోతి : చారిత్రక ములుగు నేపథ్యాన్ని గుర్తుచేస్తూ స్థానిక కళాకారులు రూపొందించిన అడవిగన్న ములుగు అనే మొట్టమొదటి ములుగు జిల్లా పాట పోస్టర్‌ను ఈరోజు ములుగు జిల్లా కేంద్రంలో రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆవిష్కరించారు. ములుగు చరిత్ర, గిరిజన సంస్కృతి, గ్రామీణ జీవన విధానాన్ని ప్రతిబింబించేలా రూపొందిన ఈ పాట జిల్లాకు గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, సాంస్కృతిక పర్యాటకం, గ్రామీణ కళల పరిరక్షణలో ఇటువంటి పాటలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. సమాజాన్ని ప్రభావితం చేసి ప్రజలను చైతన్యం చేసే శక్తి పాటలకు ఉందని, అందుకే ఈ తరహా సృజనలను కాపాడు కోవడం ప్రజల బాధ్యత అని తెలిపారు. ఈ పాట కోసం కష్టపడ్డ గాయకులు, కళాకారులను ప్రత్యేకంగా అభినందించారు. ఈనెల 8వ తేదీ (గురువారం) జిల్లా కేంద్రంలోని రామాలయం గుడి పక్కన ఉన్న మైదానంలో జరగనున్న అడవిగన్న ములుగు పాట ఆవిష్కరణ సభకు ప్రజలందరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. కళాసంఘం అధ్యక్షులు గోల్కొండ బుచ్చన్న మాట్లాడు తూ ఇలాంటి మరెన్నో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టేందుకు కళాకారులు ఉత్సాహంగా ఉన్నారని, ప్రజలు, మేధావులు ముందుకు వచ్చి స్థానిక కళలను ఆదరించి ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కళాకారులు రాగుల శంకర్, గోల్కొండ బుచ్చన్న, రేలా కుమార్, ఈశ్వర్ ప్రసాద్, మోతె రమేష్, పత్తిపల్లి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.






