కొనుగోలు దారుల వద్ద ఆధార్ కార్డు ప్రతిని సేకరించాలి
– డిఎస్పి రామ్మోహన్ రెడ్డి
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి : అసాంఘిక కార్యక లాపాలకు పరోక్షంగా అవసరమయ్యే సామాగ్రిని కొనుగోలు చేసే వ్యక్తుల నుంచి ఆధార్ కార్డును తప్పనిసరిగా సేకరించి, భద్రపరచాలని కాటారం డి.ఎస్.పి గడ్డం రామ్మోహన్ రెడ్డి సూచించారు. ఈ మేరకు శుక్రవారం కాటారం డిఎస్పీ ఛాంబర్ లో కాటారం మండల కేంద్రానికి చెందిన ఎలక్ట్రికల్, హార్డ్వేర్ దుకాణదారులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ మధ్యకాలంలో అటవీ జంతువుల వధ కోసం కరెంటు తీగల ఉచ్చులను ఏర్పాటు చేయడంలో కరెంటు సామాగ్రి వాడు తున్న నేపథ్యంలో దుకాణదారులతో సమావేశం నిర్వహిం చారు. వన్యప్రాణుల వేట కోసం ఉపయోగించే సామాగ్రిని అనుమానితులకు, అపరిచితులకు అమ్మవద్దని, తప్పనిసరి పరిస్థితుల్లో అమ్మకాలు చేపట్టిన కొనుగోలుదారుల నుంచి ఆధార్ కార్డును సేకరించాలని ఆయన అన్నారు. వన్య ప్రాణుల కోసం అమర్చిన కరెంటు ఉచ్చులకు ఇటీవల కాలం లో పశువులు, రైతులు, తాజాగా కాటారం మండలం నస్తూరు పల్లి అటవీ ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంలో రహదారి వెంబడి కూంబింగ్ నిర్వహిస్తున్న సిఆర్పిఎఫ్ జవాన్ కరెంటు ఉచ్చులకు మృత్యువాత చెందడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై కఠిన నిర్ణయాలను అమలు చేస్తుంది. ఈ నేపథ్యంలో అటవీ ప్రాంతంలోని వన్యప్రాణుల వధ కోసం ఉచ్చులను అమర్చే వేటగాల్లను గుర్తించడం, వారిపై వేటు వేసేందుకు పోలీసు శాఖ ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ నివారణ చర్యలు చేపట్టినట్లు కాటారం డిఎస్పి రామ్మోహన్ రెడ్డి, కాటారం ఎస్సై మ్యాక అభినవ్ వివరించారు.