ములుగు జిల్లా వాజేడు మండలంలో రోడ్డు ప్రమాదం
బొలెరో పల్టీ – ఒకరు మృతి, 14 మందికి గాయాలు
వెంకటాపురం, జనవరి 4, తెలంగాణ జ్యోతి : వాజేడు మండలం మండపాక సమీపంలో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భవన నిర్మాణ కూలీలను తీసుకెళ్తున్న బొలెరో ట్రాలీ ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయే క్రమంలో అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, 14 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రమాదానికి గురైన కూలీలు మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. వారు వెంకటాపురం మండలంలో ఇంటి నిర్మాణ పనుల కోసం (స్లాబులు వేయడానికి) వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే 108 అంబులెన్స్ ద్వారా క్షతగాత్రులను ఏటూరు నాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానికుల కథనం ప్రకారం, ఎదురుగా వచ్చిన ద్విచక్ర వాహనం అతివేగంగా రావడంతో ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.





