నర్సాపూర్ మూలమలుపు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
– కారుపల్టీ కొట్టగా మహిళ మృతి
వెంకటాపూర్, డిసెంబర్ 17, తెలంగాణజ్యోతి : వెంకటాపూర్ మండలం నర్సాపూర్ గ్రామ శివారులోని మూలమలుపు వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఎస్సై చల్లా రాజు తెలిపిన వివరాలప్రకారం.. భూపాలపల్లి సింగరేణిలో ఉద్యోగం చేస్తున్న అల్వాల దేవేందర్ తన సొంత గ్రామమైన నర్సంపేట మండలం గురిజాలకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చి, తిరిగి వెళ్తున్న క్రమంలో నర్సాపూర్ మూలమలుపు వద్ద కారు అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో అతడి భార్య అపర్ణ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.






