గ్రామ రాజకీయాల్లో నిశ్శబ్దంగా కదిలిన ఓ శక్తి..!
గెలుపుల వెనుక కనిపించని చెయ్యి..?
కన్నాయిగూడెం, (తెలంగాణ జ్యోతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఫలితాలు వెలువడ్డాయి. సర్పంచ్‌లు గెలిచారు. కానీ… ఈ గెలుపుల వెనుక అసలు కథ ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది. తెర ముందు కనిపించని ఓ నాయకుడు, తెర వెనుక నుంచి గ్రామ రాజకీయాల దిశనే మార్చేశాడన్న చర్చ ఇప్పుడు మండలమంతా హాట్ టాపిక్‌గా మారింది.
అభ్యర్థి ఎంపిక నుంచే మొదలైన వ్యూహం
ఎవరు నిలబడాలి… ఎవరు వద్దు… ఏ గ్రామంలో ఏ వర్గం కీలకం… ఏ కుటుంబానికి ప్రజల్లో నమ్మకం ఉంది… అన్నది ముందే అంచనా వేసి అభ్యర్థులను ఎంపిక చేశారన్నది రాజకీయ వర్గాల మాట. చివరి నిమిషంలో టికెట్లు మారిన చోట, ఆ మార్పు వెనుక కూడా అదే నాయకుడి వ్యూహం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఫలితాలు చూస్తే… ఆ అంచనాలు తప్పలేదని అంటున్నారు.
విభేదాల మధ్య సమన్వయమే ఆయుధం
గ్రామ రాజకీయాల్లో విభేదాలు కొత్తకాదు. కానీ ఈ ఎన్నికల్లో అనూహ్యంగా చాలా చోట్ల ఐక్యత కనిపించింది. పోటీ పడాల్సిన వారు వెనక్కి తగ్గారు. అసంతృప్తులు శాంతించాయి. ఇదంతా ఎలా సాధ్యమైంది? అక్కడే ఆ నాయకుడి పాత్ర మొదలైంది అంటున్నారు. వ్యక్తిగతంగా చర్చలు… రాత్రివేళ సమావేశాలు… హామీలు, హితవులు… అవసరమైతే హెచ్చరికలు… అన్నీ కలిపి ఓ వ్యూహాత్మక సమన్వయం జరిగిందన్నది అంతర్గత వర్గాల సమాచారం.
ప్రచారంలో కనిపించని కానీ ప్రభావవంతమైన హస్తం
ఎన్నికల ప్రచారంలో ఆయన పేరు పెద్దగా వినిపించలేదు. వేదికలపై కనిపించలేదు. కానీ గ్రామగ్రామాన చర్చ మాత్రం ఆయన గురించే సాగింది. యువతను, మహిళలను మౌనంగా సంఘటితం చేయడం… ఇంటింటి చర్చలకు దిశానిర్దేశం చేయడం… ఓటింగ్ రోజున పోలింగ్ శాతం పెరిగేలా ప్లానింగ్ చేయడం… అన్నీ ముందే స్కెచ్ వేసినట్టే జరిగాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇది కేవలం గెలుపా… లేక సంకేతమా?
ఈ ఫలితాలు కేవలం సర్పంచ్ ఎన్నికల వరకే పరిమితమా? లేక భవిష్యత్ స్థానిక సంస్థల రాజకీయాలకు ఇది రిహార్సలా? అన్న ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఒకే మండలంలో ఇంత సమన్వయంతో వచ్చిన గెలుపులు… యాదృచ్ఛికమా? కాదన్నది చాలామందికి స్పష్టమే.
ఎవరు ఆ నాయకుడు? ఎందుకు నిశ్శబ్దం?
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అంతటి ప్రభావం చూపిన ఆ నాయకుడు ఇప్పటికీ పూర్తిగా నిశ్శబ్దంగానే ఉన్నాడు. తన పేరు బయటకు రాకుండా జాగ్రత్త పడుతూనే, రాజకీయ పరిణామాలను మాత్రం తన వ్యూహానికి అనుగుణంగా మలిచాడన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సర్పంచ్‌ల విజయాల వెనుక అసలు వ్యూహం ఏమిటి? ఈ ప్రణాళికలు కేవలం గ్రామ స్థాయికే పరిమితమా, లేక భవిష్యత్ స్థానిక సంస్థల ఎన్నికల వరకు విస్తరించనున్నాయా? అన్న ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఆ నిశ్శబ్ద నాయకుడు ఎవరు? ఆయన రాజకీయ ప్రయాణం ఎక్కడివరకు వెళ్లబోతోంది? అన్న పూర్తి వివరాలతో కూడిన కథనం త్వరలోనే తెలంగాణ జ్యోతి ప్రత్యేక కథనంగా మీ ముందుకు రానుంది.






