డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థి మిస్సింగ్ : కేసు నమోదు
వెంకటాపురం నూగూరు, డిసెంబర్ 19 (తెలంగాణ జ్యోతి): ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్ర శివారులోని బీసీ మరిగూడెం పంచాయతీ నేలారిపేట గ్రామానికి చెందిన యన్నమల్ల జయరాజు చిన్న కుమారుడు యన్నమల్ల జయపాల్ బీఎస్సీ ప్రథమ సంవత్సరం విద్యార్థి మిస్సింగ్ అయిన ఘటనపై వెంకటాపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ నెల 18వ తేదీ గురువారం రాత్రి 10:30 గంటల సమయంలో జయపాల్ తన స్నేహితులతో కలిసి దానవైపేట గ్రామ శివారులోని గోదావరి నది ఒడ్డుకు వెళ్లగా, అక్కడ నుంచి ఒక్కడే ఫోన్ మాట్లాడు కుంటూ ఇసుక ప్రాంతంలో గోదావరి వైపు నడుచుకుంటూ వెళ్లి దారి తెలియడం లేదని స్నేహితులకు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. వాట్సాప్ లొకేషన్ పంపినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు గోదావరి ఇసుక తిన్నెల ప్రాంతంలో వెతికినా ఫలితం లేకపోయిందని, తండ్రి జయరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు వెంకటాపురం ఎస్.ఐ. కె. తిరుపతిరావు గురువారం రాత్రి విడుదల చేసిన ప్రెస్ నోట్‌లో పేర్కొన్నారు.






