ములుగు జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ నియామకాలపై కీలక సమావేశం
పార్టీ కోసం కష్టపడే వారికి సముచిత స్థానం
టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ కొండేటి మల్లయ్య, జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్
ములుగు, జనవరి 07 (తెలంగాణ జ్యోతి): రాష్ట్ర మంత్రి ఆదేశాల మేరకు ములుగు జిల్లా కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, జిల్లా కార్యవర్గ నియామకాలు, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాగ్ అశోక్ మాట్లాడుతూ, ములుగు జిల్లాలో రెండవసారి తనపై విశ్వాసం ఉంచి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన ప్రతి నాయకుడికి, కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సభ్యుల నియామక ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అనంతరం టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ కొండేటి మల్లయ్య మాట్లాడుతూ, మంత్రి సీతక్క జిల్లాలో జిల్లా కమిటీ నియామకాలకు ఇంచార్జిగా రావడం తనకు గర్వకారణమని అన్నారు. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు, బాధ్యతలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీలో కార్యదర్శులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, వివిధ పదవులు ఆశిస్తున్న నాయకుల వివరాలను సేకరించి, వాటిని టీపీసీసీ అధ్యక్షుడు దృష్టికి తీసుకెళ్లి, రాష్ట్ర మంత్రి సీతక్క సలహాలతో త్వరలోనే జిల్లా కార్యవర్గ కమిటీని ప్రకటిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ నియామకాల ఇంచార్జిగా వచ్చిన కొండేటి మల్లయ్యను జిల్లా అధ్యక్షుడు పైడాగ్ అశోక్ శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ , రాష్ట్ర పంచాయతీ రాజ్ డైరెక్టర్ , వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, వివిధ మండలాల అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





