సమ్మక్క–సారలమ్మ జాతర వైద్య ఏర్పాట్లపై కన్వర్జెన్సీ మీటింగ్
ములుగు, డిసెంబర్ 31, తెలంగాణ జ్యోతి : ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ములుగులో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. గోపాల్ రావు, జిల్లా జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డా. చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కన్వర్జెన్సీ మీటింగ్ నిర్వహించారు. రాబోయే శ్రీ సమ్మక్క–సారలమ్మ మహా జాతరను దృష్టిలో పెట్టుకొని భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ముందస్తు ప్రణాళికలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు, మేడారంలో ఫస్ట్ రిఫరల్ సెంటర్‌గా 50 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సెకండరీ లెవెల్ చికిత్స కోసం ములుగు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో భక్తుల కోసం ప్రత్యేకంగా 20 పడకల వార్డు ఏర్పాటు చేయనున్నారు. టైర్షరీ లెవెల్ వైద్య సేవల కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ వైద్య కేంద్రాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, స్పెషలిస్ట్ వైద్యులు, మందులు, వైద్య పరికరాలు సమకూర్చే ప్రక్రియ కొనసాగుతోందని డీఎంహెచ్‌వో డా. గోపాల్ రావు మరియు సూపరింటెండెంట్ డా. చంద్రశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్లు డా. పవన్ కుమార్, డా. శ్రీకాంత్, ఏడీ గఫర్, వైద్యాధికారి గౌతం, డిపిఎం సంజీవరావు, జిల్లా ఫార్మసీ ఇన్‌చార్జ్ వినోద్, మానిటరింగ్ సూపర్వైజర్ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.








