బీఆర్ఎస్ నాయకుడిపై కత్తితో దాడిచేసిన కాంగ్రెస్ నాయకుడు
– బీఆర్ఎస్ నాయకుని భార్యకు గాయం
– భూ తగాదాలే కారణంగా భావిస్తున్న పోలీసులు
– ములుగు మండలం ఇంచర్లలో ఘటన
– ములుగు పోలీస్ స్టేషన్ లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు
– ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళను పరామర్శించిన జడ్పీ చైర్ పర్సన్
ములుగు, తెలంగాణ జ్యోతి : భూతగాదాలతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయ కుల మధ్య జరిగిన గొడవలో బీఆర్ఎస్ నాయకుడి భార్య చేతికి గాయాలయ్యాయి. బీఆర్ఎస్ నాయకుడిపై కాంగ్రెస్ నాయకుడు కత్తితో దాడి చేసిన సంఘటన శనివారం ములుగు మండలంలోని ఇంచర్ల గ్రామంలో జరిగింది. గ్రామస్థులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంచర్ల గ్రామానికి చెందిన శానబోయిన అశోక్ మాజీ ఎంపీటీసీగా పనిచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. అదేవిధంగా మామిడి అశోక్ అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఇరువురికి ఇంచర్ల శివారులో ఉన్నభూములు ఉన్నాయి. వారి పొలాల్లో మట్టి తరలింపు చేస్తుండగా ఒకరిపై ఒకరు గతంలో ఫారెస్ట్, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసుకునే వారని గ్రామస్థులు చెబుతున్నారు. అయితే శనివారం ఇంచర్ల గ్రామంలో ఇద్దరి మధ్య వాగ్వివాదం నెలకొని గొడవకు దారితీసింది. మామిడి అశోక్ ను శానబోయిన అశోక్ లు ఇద్దరు ఒకరినొకరు దూషించుకోవడంతో తీవ్ర కోపోద్రిక్తుడైన కాంగ్రెస్ నాయకుడు శానబోయిన అశోక్ కత్తితో మామిడి అశోక్ పై దాడికి పాల్పడ్డాడు. ఇరువురిని వారించేందుకు గ్రామస్థులు ప్రయత్నించగా మామిడి అశోక్ భార్య వసంత చేతికి కత్తి గాయాలయ్యాయి. వెంటనే ములుగు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
– జడ్పీ చైర్మన్ నాగజ్యోతి పరామర్శ
ములుగు జడ్పీ చైర్ పర్సన్ బడే నాగజ్యోతి బాధిత మహిళను పరామర్శించి పోలీసు అధికారులకు ఫోన్ చేసి విషయం తెలుసుకున్నారు. ఈగొడవపై ఇరువురు ములుగు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, తమ కార్యకర్తలపై దాడులకు పాల్పడిన వారిపై పోలీసు అధికారులు చర్యలు తీసుకొని చట్టరిత్య శిక్షించాలని జడ్పీ చైర్ పర్సన్ నాగజ్యోతి డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఇలాంటి దాడులు జరుగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే శానబోయిన అశోక్ సైతం గతంలో బీఆర్ఎస్ లోనే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.