అభివృద్ధి చేయని చోటుకు ఎందుకు వస్తున్నారు..!
మాజీ సర్పంచ్ నిట్టూరు శేఖర్
కాటారం, ఏప్రిల్ 18, తెలంగాణ జ్యోతి: అధికారంలోకి వచ్చిన తరువాత కూడా గ్రామంలో రూపాయి విలువైన అభివృద్ధి పనులు చేయలేదని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి పర్యటనపై నస్తురుపల్లి మాజీ సర్పంచ్ నిట్టూరు శేఖర్ తీవ్రంగా స్పందించారు. కాటారం మండలం నస్తురుపల్లి గ్రామంలో జరగనున్న సభను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, 30 నెలలు గడిచినా గ్రామపంచాయతీకి కనీస అభివృద్ధి చేయలేదని, అలాంటి పరిస్థితుల్లో ఏ ముఖంతో గ్రామానికి వస్తున్నారని ప్రశ్నించారు. గ్రామంలో ఇళ్ల సమస్య, పంచాయతీ భవనం లేకపోవడం, నీటి ఎద్దడి, చెరువుల అభివృద్ధి, సాగునీటి సౌకర్యం, దేవాలయాల నిర్మాణం, మినరల్ వాటర్ సౌకర్యం, ఎస్టీ కమ్యూనిటీ హాల్ వంటి అనేక సమస్యలు సంవత్సరాలుగా పరిష్కారం కాకుండా ఉన్నాయని పేర్కొన్నారు. ఎస్టీ కుటుంబాలకు 30 ఇళ్లు, ఎస్సీ కుటుంబాలకు 20 ఇళ్లు మంజూరు చేయగలరా అని ప్రశ్నిస్తూ, నల్ల చెరువు, చింతల చెరువుల అభివృద్ధి చేసి కాళేశ్వరం ప్రాజెక్టుతో లింకేజీ కల్పించి సాగునీరు అందించగలరా అని డిమాండ్ చేశారు. గ్రామ ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చే స్థాయిలో చర్యలు తీసుకున్నప్పుడే నస్తురుపల్లికి రావాలని, లేనిపక్షంలో పర్యటన అర్థరహితమని ఆయన వ్యాఖ్యానించారు.









