రాయినిగూడెం ఆశ్రమ హై స్కూల్లో కార్యక్రమం
ములుగు, మార్చి 6 (తెలంగాణ జ్యోతి): తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ హై స్కూల్ రాయినిగూడెంలో విద్యార్థులకు మాదకద్రవ్యాల నిరోధకతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మాదకద్రవ్యాల నిరోధక చర్యలపై అవగాహన కల్పించేందుకు ములుగు ఎస్పీ కేకన్ సుధీర్ రామనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ములుగు ఎస్సై యు. ఉపేందర్ మాట్లాడుతూ విద్యార్థులు మాదకద్రవ్యాలు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. తమతోటి విద్యార్థుల్లో ఎవరైనా మాదకద్రవ్యాలకు అలవాటు పడినట్లు గమనిస్తే పోలీసులకు లేదా స్కూల్లో ఏర్పాటు చేసిన ఆంటీ డ్రగ్ కమిటీ, ప్రిన్సిపాల్‌కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. విద్యార్థి జీవితం అమూల్యమని, మంచి లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడితేనే భవిష్యత్తులో ఉన్నత స్థానాలు సాధించగలరని తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై చంద్రశేఖర్, స్కూల్ ప్రిన్సిపల్ హీరు నాయక్, అధ్యాపక బృందం, ములుగు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.








