సమ్మక్క–సారలమ్మ జాతరకు ఘన ఏర్పాట్లు
రూ.251 కోట్లతో గుడి, జాతర పనులు
జనవరి 18న మేడారంలో సీఎం బస
19న గుడి ప్రారంభం, క్యాబినెట్ సమావేశం
ములుగు, జనవరి 14 (తెలంగాణ జ్యోతి): సమ్మక్క–సారలమ్మ మహా జాతరను ఈసారి చరిత్రలో ఎప్పుడూ లేనంత ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) తెలిపారు. మేడారంలో మీడియాతో మాట్లాడిన ఆమె రాష్ట్ర ప్రజలకు, ములుగు జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.జనవరి 28 నుంచి 31 వరకు జరిగే మహాజాతరకు దేశవ్యాప్తంగా భక్తులు భారీగా తరలివస్తారని తెలిపారు. జాతరకు వచ్చే అతిథులను ములుగు జిల్లా ప్రజలు ప్రేమతో స్వాగతించా లని, ప్రతి భక్తుడికి సౌకర్యవంతమైన దర్శనం కల్పించాలన్నారు.
జాతరకు నిధుల వరద
ఈసారి జాతర నిర్వహణకు ప్రభుత్వం రూ.150 కోట్లు కేటాయించిందని, సమ్మక్క–సారలమ్మ గుడి నిర్మాణానికి మరో రూ.101 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి వెల్లడించారు. మూడు నెలల్లోనే గుడి నిర్మాణం పూర్తి చేయడం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమన్నారు.
మేడారం దేశ దృష్టిని ఆకర్షించనున్న వేళ
దేశం నలుమూలల నుంచి భక్తులు తరలిరానున్న నేపథ్యంలో భద్రత, పార్కింగ్, తాగునీరు, వైద్య సేవలు, విద్యుత్, పారిశుద్ధ్యం వంటి అన్ని ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేసినట్లు తెలిపారు.
18న సీఎం మేడారంలో బస
జనవరి 18వ తేదీ రాత్రి సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు మేడారంలో బస చేస్తారని మంత్రి తెలిపారు. ఆ రోజు సాయంత్రం జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపు నిచ్చారు.
19న ఉదయం గుడి ప్రారంభోత్సవం
జనవరి 19వ తేదీ ఉదయం ఆరు నర నుంచి ఎనిమిది గంటల లోపు నూతనంగా నిర్మించిన సమ్మక్క–సారలమ్మ గుడి, గద్దెల ప్రారంభోత్సవం జరుగుతుందని చెప్పారు. ఈ చారిత్రక ఘట్టంలో పాల్గొని తొలి దర్శనం చేసుకోవాలని ప్రజలను ఆహ్వానించారు.
మేడారంలోనే క్యాబినెట్
సమ్మక్క–సారలమ్మ గద్దెల సమీపంలోనే రాష్ట్ర క్యాబినెట్ సమావేశం నిర్వహించాలనే నిర్ణయం ములుగు జిల్లాకు గర్వకారణమని మంత్రి తెలిపారు. ఇది దేవతల పట్ల ప్రభుత్వానికి ఉన్న గౌరవానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు.
భక్తులకు ప్రత్యేక విజ్ఞప్తి
జాతరకు వచ్చే ప్రతి భక్తుడు శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో దర్శనం చేసుకోవాలని, అధికారులకు సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. మేడారం జాతరను ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక మహోత్సవంగా నిలబెట్టేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.






