వెంకటాపురం–వాజేడు మండలాల్లో మొదలైన సంక్రాంతి సందడి
– పోటాపోటీగా ముగ్గుల పోటీలు
– కిటికీటలాడుతున్న దుకాణాలు
– పిండి వంటలతో ఇంటింటా పండుగ వాతావరణం
వెంకటాపురం, జనవరి 14 (తెలంగాణ జ్యోతి): వెంకటాపురం–వాజేడు మండలాల్లో సంక్రాంతి పండుగ సందడి ఉప్పొంగింది. ములుగు జిల్లా వ్యాప్తంగా గ్రామగ్రామాన పండుగ వాతావరణం పరుచుకుని, ఇళ్ల ముందు ముత్యాల ముగ్గులు, రంగవల్లులతో గ్రామాలు పండుగ శోభతో కళకళలాడుతున్నాయి. మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలకు మహిళలు, యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వస్త్ర దుకాణాలు, బంగారు షాపులు, కిరాణా స్టోర్లు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. పండుగను పురస్కరిం చుకుని రెడీమేడ్ దుస్తులు, గృహోపకరణాలు, ఎలక్ట్రికల్ గూడ్స్‌పై వ్యాపారులు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించడంతో కొనుగోలుదారుల రద్దీ పెరిగింది. ముగ్గుల కోసం రంగులు, సామగ్రి విక్రయించే దుకాణాల వద్ద ప్రత్యేక సందడి నెలకొంది. ఇళ్లలో పిండి వంటల ఘుమఘుమలు పండుగ వాతావరణాన్ని మరింత రంజింపజేస్తున్నాయి. కొత్త కోడళ్ల రాకలు, బంధుమిత్రుల సందడితో గ్రామాలు సంబరాలతో నిండిపోయాయి. భోగి పండుగ సందర్భంగా బుధవారం వేకువజామున గ్రామాలన్నింటా భోగి మంటలతో సందడి నెలకొంది. మండల కేంద్రంగా ఉన్న వెంకటాపురంలో పండుగ సరుకుల కొనుగోళ్ల కోసం చుట్టుపక్కల గ్రామాల నుంచి వందల సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో ప్రధాన వీధులు కిటకిటలాడాయి. వ్యవసాయ పనులు కొంత మేరకు నిలిచిపోయి, గ్రామీణ ప్రజలు కుటుంబాలతో కలిసి ఆనందంగా సంక్రాంతిని జరుపుకుంటున్నారు.







