నిషేధిత గంజాయి పట్టివేత – 1.650 కిలోలు స్వాధీనం, ఇద్దరు అరెస్ట్
భూపాలపల్లి, జనవరి 12 (తెలంగాణ జ్యోతి): భూపాలపల్లి పట్టణంలో నిషేధిత గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 1.650 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ నరేష్ కుమార్ వెల్లడించారు. భూపాలపల్లి బస్టాండ్ సమీపంలోని కూరగాయల మార్కెట్ వద్ద ఉదయం అనుమానాస్పదంగా సంచరిస్తున్న మల్హర్ మండలం తాడిచర్లకు చెందిన కుంట శివ, భూపాలపల్లి పట్టణంలోని హనుమాన్ నగర్‌కు చెందిన ఉర్సు దిలీప్ కుమార్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా వారి వద్ద నుంచి 1,650 గ్రాముల నిషేధిత గంజాయి లభ్యమైంది. ఈ మేరకు మాదకద్రవ్యాల నియంత్రణ చట్టం కింద ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.జిల్లాలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారని, ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై సమాచారం ఉంటే ప్రజలు వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఆయన కోరారు.






