మల్లంపల్లి బ్రిడ్జి పనులను పరిశీలించిన మంత్రి సీతక్క
ములుగు, జనవరి 10 (తెలంగాణ జ్యోతి): మల్లంపల్లి బ్రిడ్జి పనులను పరిశీలించిన మంత్రి సీతక్క అంటూ ములుగు జిల్లా పరిధిలోని మల్లంపల్లి బ్రిడ్జి నిర్మాణ పనులను రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ సీతక్క పరిశీలించి, పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్, సంబంధిత అధికారులను ఆదేశించారు. మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు వచ్చే భక్తులు, యాత్రికులకు ఈ బ్రిడ్జి అత్యంత కీలకంగా ఉండటంతో జాతర ప్రారంభానికి ముందే వాహన రాకపోకలకు అనుకూలంగా బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకురావాలని ఆమె సూచించారు. బ్రిడ్జి నిర్మాణం వల్ల ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం కలగకుండా తాత్కాలిక మార్గాలు, భద్రతా ఏర్పాట్లు చేయాలని, పనుల్లో నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని మంత్రి స్పష్టం చేశారు. మేడారం జాతర నిర్వహణకు రవాణా సౌలభ్యం అత్యంత ప్రాధాన్యమని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆమె ఆదేశించారు. ఈ తనిఖీలో సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్ ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.






