జలగలంచ వ్యూ పాయింట్ ప్రారంభించిన మంత్రి సీతక్క
ములుగు అడవి అందాలకు ఆహ్వానం
చైనా మాంజాలు నిషేధమన్న మంత్రి
తాడ్వాయి, జనవరి 10 (తెలంగాణ జ్యోతి) : ములుగు జిల్లా పచ్చని అడవి అందాలను రాష్ట్ర ప్రజలకు పరిచయం చేస్తూ, కుటుంబ సమేతంగా ఆరోగ్యవంతమైన పర్యటన కోసం ములుగు జిల్లాకు పర్యాటకులు రావాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా–శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క పిలుపునిచ్చారు. శనివారం తాడ్వాయి మండలం పరిధిలోని జలగలంచ వాగు ప్రాంతంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పచ్చని అడవి అందాల వ్యూ పాయింట్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటికే బొగత జలపాతం వేలాది పర్యాటకులను ఆకర్షిస్తోందని, గతంలో జలగలంచ వద్ద బ్లాక్‌బెర్రీ ఐల్యాండ్, తాడ్వాయి హట్స్ వద్ద సఫారీ ఏర్పాటు చేసినట్టు గుర్తు చేశారు. ఇప్పుడు ప్రారంభించిన జలగలంచ వ్యూ పాయింట్‌తో ములుగు అడవి అందాలు ఊటీ, కొడైకెనాల్‌లకు దీటుగా పర్యాటకులను ఆకట్టుకుంటాయని చెప్పారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులు కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ప్రకృతి మధ్య ఆనందంగా గడిపేందుకు ములుగు జిల్లా సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, పండుగ వేళ చైనీస్ మాంజా దారాల వాడకం వల్ల ప్రాణనష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మనుషులకే కాకుండా పక్షులకు కూడా ఈ మాంజాలు ప్రమాదకరమని పేర్కొంటూ, ప్రజలంతా వాటిని స్వచ్ఛందంగా పూర్తిగా నిషేధించాలని పిలుపునిచ్చారు. సురక్షితమైన పతంగి దారాలను మాత్రమే వినియోగిస్తూ బాధ్యతాయు తంగా పండుగ జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేఖన్, డీఎఫ్‌వో రాహుల్ కిషన్ జాదవ్, ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, అటవీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.







