బెల్టు షాపులపై నిఘా కరువు… అక్రమాలకు అడ్డుకట్ట కరువు
శాంతిభద్రతలకు ముప్పుగా బెల్టు షాపులు
రాత్రివేళల్లోనూ కొనసాగుతున్న అక్రమ దందా
కన్నాయిగూడెం, జనవరి 8 (తెలంగాణ జ్యోతి): మండల వ్యాప్తంగా బెల్టు షాపులపై సరైన నిఘా లేకపోవడంతో అక్రమ మద్యం విక్రయాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అనుమతించిన సమయాలను పట్టించుకోకుండా రాత్రి వేళల్లోనూ మద్యం విక్రయాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాత్రి వేళల్లోనూ యథేచ్ఛగా విక్రయాలు : నియమ నిబంధనలను లెక్క చేయకుండా బెల్టు షాపులు రాత్రి సమయాల్లోనూ తెరిచి ఉంచి మద్యం విక్రయిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. దీంతో చట్టబద్ధమైన మద్యం దుకాణాల సమయాలకు అర్థం లేకుండా పోతోందని విమర్శిస్తున్నారు.
శాంతిభద్రతలకు భంగం :బెల్టు షాపుల వద్ద రోజు పొడవునా గుమి గూడే జనంతో గ్రామాల్లో శాంతిభద్రతలు దెబ్బతింటున్నాయని స్థానికులు చెబు తు న్నారు. ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు రాకపోకల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,అసౌకర్యవాతావరణంనెలకొంటోందనివాపోతున్నారు
మద్యం మత్తులో గొడవలు : మద్యం సేవించిన కొందరు వ్యక్తులు రోడ్డు పైనే గొడవలకు దిగడం, అసభ్య ప్రవర్తనకు పాల్పడడం వల్ల కుటుంబ కలహాలు పెరుగుతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో ప్రశాంత వాతావరణం దెబ్బతింటోందని వారు పేర్కొంటున్నారు.
అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు : సంబంధిత అధికారులు బెల్టు షాపు లపై సరైన పర్యవేక్షణ చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తనిఖీలు అరుదుగా మాత్రమే జరుగుతున్నాయని, చర్యలు తీసుకున్నా అవి కాగితాలకే పరిమితమవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ : ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ మద్యం విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నిరంతర తనిఖీలు నిర్వహించి బెల్టు షాపులపై కఠిన చర్యలు తీసుకుంటేనే గ్రామాల్లో శాంతిభద్రతలు పునరుద్ధరమవు తాయని వారు స్పష్టం చేస్తున్నారు.






