అంతర్జాతీయ స్థాయికి గిరిజన క్రీడాకారులు ఎదగాలి

On: January 7, 2026 2:23 PM

అంతర్జాతీయ స్థాయికి గిరిజన క్రీడాకారులు ఎదగాలి

అంతర్జాతీయ స్థాయికి గిరిజన క్రీడాకారులు ఎదగాలి

 రాష్ట్ర స్థాయి 6వ గిరిజనసంక్షేమ క్రీడలను ప్రారంభించిన మంత్రి  సీతక్క

ఏటూరునాగారం, జనవరి 7 (తెలంగాణ జ్యోతి): ఆదివాసీ గిరిజన విద్యార్థులు క్రీడలలో అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ–శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఆకాంక్షించారు. బుధవారం రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ, గిరిజన కమిషన్ ఆధ్వర్యంలో ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఐటిడిఏ జంబోరి మైదానంలో నిర్వహించిన 6వ రాష్ట్రస్థాయి గిరిజన సంక్షేమ క్రీడా పోటీలను మంత్రి సీతక్క ఐటిడిఏ పీవో, క్రీడల అధికారులతో కలిసి క్రీడా జ్యోతి వెలిగించి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన విద్యార్థులు, గిరిజన క్రీడాకారుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, వారి సమగ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. రాష్ట్రస్థాయి గిరిజన క్రీడా పోటీలను ములుగు జిల్లా ఏటూరునాగారంలో నిర్వహించడం గర్వకారణమని, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పాల్గొంటున్న క్రీడాకారు లందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

క్రీడలతో పాటు విద్యలోనూ ప్రతిభ చూపాలని, ట్రైబల్ వెల్ఫేర్ విద్యాల యాల్లో చదువుతున్న విద్యార్థులు మంచి ఫలితాలతో ముందుకు సాగుతు న్నారని చెప్పారు. రాబోయే పదో తరగతి, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలని సూచించారు. విద్యార్థి దశలోనే శరీర దృఢత్వం అలవర్చుకోవాలని, ఆరోగ్యమే మహాభాగ్యమని అన్నారు.

స్మార్ట్‌ఫోన్, టెలివిజన్‌కు అతిగా ఆకర్షితులవుతున్న పిల్లలు మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వసతి గృహాల్లో ఉండే విద్యార్థులు రోజూ క్రీడలకు ప్రాధాన్యం ఇస్తూ చదువుకోవాలని సూచించారు. క్రీడలలో గెలుపు–ఓటమి సహజమని, స్నేహపూర్వక వాతావరణంలో పోటీలు జరగాలని అన్నారు. ఓడిన విద్యార్థులు తమ లోపాలను గుర్తించి మరింత శ్రమించి గెలుపు సాధించాలని, గెలిచినవారు ఇంకా ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని హితవు పలికారు.

చదువును కష్టంగా కాకుండా ఇష్టంగా చదవాలని, గురువులను గౌరవించడం, పెద్దలను మర్యాదపూర్వకంగా సంబోధించడం, మహోన్నత వ్యక్తుల జీవిత చరిత్రలను తెలుసుకోవడం ద్వారా నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని సూచించారు. ఆదివాసీ గిరిజన విద్యార్థుల్లోని నైపుణ్యాలను ప్రోత్సహించడం, ప్రతిభావంతులను గుర్తించి రాష్ట్రస్థాయిలో అవకాశాలు కల్పించడమే 6వ రాష్ట్రస్థాయి గిరిజన సంక్షేమ క్రీడా పోటీల ప్రధాన లక్ష్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఐటిడిఏ పీవో చిత్రా మిశ్రా, ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, గిరిజన క్రీడా శాఖ అధికారులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!